Uddhav thackeray: నిందితులకు అండగా మహారాష్ట్ర ప్రభుత్వం.. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే

by vinod kumar |
Uddhav thackeray: నిందితులకు అండగా మహారాష్ట్ర ప్రభుత్వం.. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై నేరాలకు పాల్పడే నిందితులపై చర్యలు తీసుకునే బదులు మహారాష్ట్ర ప్రభుత్వమే వారికి అండగా నిలుస్తుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. బద్లాపూర్‌లో శనివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు భరోసా ఇవ్వడానికి మహాయుతి ప్రభుత్వాన్ని తొలగించడం అత్యవసరమన్నారు. చిన్నారులపై లైంగిక దాడి జరిగితే దోషులపై చర్యలు తీసుకునే బదులు వారి పక్షాన నిలవడం విచారకరమన్నారు. బద్లాపూర్ ఘటనకు నిరసనగా ఆగస్టు 24న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ), విపక్షాలు పిలుపునిచ్చిన బంద్‌లో రాజకీయ పార్టీలు ముందుకు వెళ్లకుండా బొంబాయి హైకోర్టు నిషేధం విధించిందని తెలిపారు. కోర్టు బంద్ ను నిలిపివేసినా మాట్లాడే గొంతును మాత్రం అణచివేయలేదని చెప్పారు. సోదరీమణులు సురక్షితంగా ఉంటే ఇల్లు సురక్షితం అనే నినాదంతో సంతకాల ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. దీనిని హైకోర్టుకు అందజేయనున్నట్టు వెల్లడించారు. కాగా, ఇటీవల బద్లాపూర్ లోని ఓ పాఠశాలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story