Uddhav Thackeray: ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలి.. శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే

by vinod kumar |
Uddhav Thackeray: ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలి.. శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికల రంగంలోకి దిగాలన్నారు. ముంబైలో శుక్రవారం నిర్వహించిన మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి సమావేశంలో ఉద్ధవ్ ప్రసంగించారు. ‘అత్యధిక ఎమ్మెల్యేలున్న పార్టీకి సీఎం పదవి అనే విధానాన్ని అనుసరించకూడదనే అభిప్రాయంతో ఉన్నాం. గత అనేక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ విషయంపై పూర్తి అనుభవం ఎదురైంది. సీఎం అభ్యర్థిని ప్రకటించకపోతే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తాయి. కాబట్టి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకే సీఎం పదవి రావాలని నేను కోరుకోను’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రం కోసం దేశం కోసం ఏం చేయాలనే దానిపైనే చర్చిస్తామన్నారు. ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ నుంచి ముఖ్యమంత్రిని ప్రకటించే విధానం అంతర్గత విభేదాలను ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడ్డారు. కూటమి సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) ప్రకటించిన ఏ అభ్యర్థికైనా తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడే పోరాటమన్నారు. ఎంవీఏ కూటమి అధికారంలోకి వస్తే దేశాలయాలు, వక్ఫ్ భూములకు రక్షణ కల్పిస్తా మన్నారు. అయోధ్యలో భూ ఒప్పందాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాతే ప్రచారం ప్రారంభించాలని ఎంవీఏ భాగస్వాములను కోరారు. మరాఠా రిజర్వేషన్‌కు సంబంధించి లోక్‌సభలో బిల్లు తెస్తే దానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. శివసేన విల్లు బాణం గుర్తు షిండేకు వెళ్లడంపై స్పందిస్తూ.. వారు విల్లు, బాణాలు దొంగిలిస్తే, వాటిని కాల్చడానికి నేను కాగడా వెలిగించాలని తెలిపారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఉద్ధవ్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement

Next Story