Tvk party: టీవీకే పార్టీకి ఈసీ గుర్తింపు.. వెల్లడించిన నటుడు విజయ్

by vinod kumar |
Tvk party: టీవీకే పార్టీకి ఈసీ గుర్తింపు.. వెల్లడించిన నటుడు విజయ్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అనుమతిచ్చినట్టు ప్రముఖ తమిళ నటుడు, ఆ పార్టీ చీఫ్ విజయ్ వెల్లడించారు. పార్టీ రిజిస్టర్ నిమిత్తం ఫిబ్రవరి 2న ఈసీని సంప్రదించగా తాజాగా పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘దేశ ఎన్నికల సంఘం టీవీకేని చట్ట బద్ధంగా పరిగణించింది. దీంతో టీవీకే రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ విషయాన్ని ప్రజలతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర సదస్సుకు సన్నాహాలు ప్రారంభించామని, దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను త్వరలోనే ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

2026 ఎన్నికలపై ఫోకస్ !

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే పని చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ విజయ్ ఈ విషయాన్ని పలు మార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రణాళికలను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే టీవీకే ప్రకటించినప్పటికీ, ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేగాక ఎవరికీ మద్దతు ప్రకటించలేదు.

కాగా, విజయ్ ఫిబ్రవరి 2న టీవీకే పార్టీని ప్రకటించారు. ఆగస్టు 22న తన పార్టీకి జెండాను, గుర్తును ఆవిష్కరించారు. అనంతరం పనైయూర్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి, రాజకీయ పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు. ఈ జెండాకు రెండు రంగుల మెరూన్, పసుపు జెండాలో రెండు వైపులా ఏనుగులు, మధ్యలో నక్షత్రాలు చుట్టూ నెమలి ఉన్నాయి. తమిళనాడు సంక్షేమం కోసమే పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Advertisement

Next Story