దేశాన్ని జైలులా మార్చారు.. ప్రధాని మోడీపై దీదీ ఫైర్

by Hajipasha |
దేశాన్ని జైలులా మార్చారు.. ప్రధాని మోడీపై దీదీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. దేశాన్ని జైలులా మార్చారంటూ మోడీపై ఆమె మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మమత ప్రసంగించారు. ‘‘ప్రధానమంత్రి ఆదివారం రోజు జల్పాయ్‌గురిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను ఆయన హోదాను గౌరవిస్తాను. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్ధించను’’ అని దీదీ చెప్పారు. ‘‘జూన్ 4 తర్వాత అందరినీ ఒక్కొక్కరిగా జైల్లో పెట్టిస్తా’’ అని ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతలకు హెచ్చరికలు చేయడం సబబేనా అని ఆమె ప్రశ్నించారు. దేశాన్ని జైలులా మార్చాలనే దురుద్దేశం ఉందని ప్రధాని మాటలతో తేటతెల్లం అవుతోందని దీదీ పేర్కొన్నారు. ‘‘మోడీజీ.. మీకు ఒక జేబులో ఈడీ, సీబీఐ, మరో జేబులో ఎన్‌ఐఏ, ఐటీ విభాగాలు ఉన్నాయి. మీ పార్టీకి నిధులు రావడానికి ఈ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. వాటి ద్వారా ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి బెదిరింపులకు పాల్పడకూడదు. వాటికి మేం భయపడం’’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారు? జైలులో ఉన్నప్పటికీ .. ఆయన పాలనా వ్యవహారాలను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ పరిణామం కేజ్రీవాల్‌ విజయావకాశాలను ఏ మాత్రం ప్రభావితం చేయదు. ఆప్ మరింత మెజారిటీతో ఢిల్లీలో గెలిచే ఛాన్స్ ఉంది’’ అని దీదీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story