Tunnel Collapsed: కొండచరియలు విరిగిపడటంతో కుప్పకూలిన భారీ సొరంగం

by Ramesh Goud |
Tunnel Collapsed: కొండచరియలు విరిగిపడటంతో కుప్పకూలిన భారీ సొరంగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సిమ్లాలో నిర్మాణంలో ఉన్న భారీ సొరంగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో టన్నెల్ లోపల ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్ల కనెక్టివిటీ లో భాగంగా నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కల్కా- సిమ్లా హైవేపై సంజౌలి ప్రాంతంలో ఫోర్ వే టన్నెల్ ను నిర్మిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండ చరియలు అస్థిరంగా తయారయ్యాయి. సొరంగం బయట కొండ చరియలు కూలడం గమనించిన ఓ అధికారి కార్మికులను అలర్ట్ చేశాడు.

దీంతో అందరూ అప్రమత్తమై టన్నెల్ నిర్మాణం పని ఆపి, దూరంగా వెళ్లారు. అనంతరం కొద్ది సేపటికే కొండ చరియలు విరిగిపడి టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీనిపై ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్ట్ మేనేజర్ అచల్ జిందాల్ స్పందిస్తూ.. భారీ వర్షాల కారణంగా కొండపై బురద కుంటలు ఏర్పడ్డాయని, దీంతో కొండచరియల్లో స్థిరత్వం కోల్పోయి కూలాయని అన్నారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, కొండ చరియలు విరిగిపడటం ముందే గ్రహించి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సహాయక బృందాలు శిధిలాలు తొలిగించి ఆ ప్రాంతాన్ని స్థిరికరించేందుకు పని చేస్తున్నాయని జిందాల్ తెలిపారు.

Next Story

Most Viewed