Tulsi Gabbard: యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తులసి గబ్బార్డ్.. హిందూ నేతకు కీలక పదవి

by vinod kumar |
Tulsi Gabbard: యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తులసి గబ్బార్డ్.. హిందూ నేతకు కీలక పదవి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రభుత్వంలోని కీలక పదవులకు నియామకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన తొలి హిందూ ఎంపీ తులసీ గబ్బార్డ్‌ (Tulsi Gabbard) ను యూఎస్ నేషనల్ ఇంటలిజెన్స్ (National intelligence) డైరెక్టర్‌గా నియమించారు. ట్రంప్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గబ్బార్డ్ సైతం విధుల్లో చేరనున్నారు. తులసి గర్వించదగిన రిపబ్లికన్ అని ట్రంప్ అభివర్ణించారు. ఆమె అమెరికన్లను గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడిన మాజీ అభ్యర్థిగా ఆమెకు రెండు పార్టీల్లో విస్తృత మద్దతు ఉందని తెలిపారు. తులసితో పాటు మరో ఇద్దరికి ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను విదేశాంగ కార్యదర్శిగా, మాట్ గేట్జ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించారు.

తులసి నేపథ్యం?

1981 ఏప్రిల్ 12న జన్మించిన గబ్బార్డ్ 21 ఏళ్ల వయసులో హవాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు. యూఎస్ మిలిటరీలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. 2013 నుంచి 2021 వరకు హవాయి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2020లో తులసి డెమొక్రాట్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి తన బిడ్ దాఖలు చేశారు. తగినంత మద్దతు లభించకపోవడంతో ఉపసంహరించుకున్నారు. అనంతం 2022లో పార్టీని వీడారు. తాజాగా ట్రంపునకు మద్దతు తెలిపిన తులసి గత నెలలోనే రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే తులసి అనే పేరు కారణంగా ఆమెను పలువురు భారత సంతతి నేతగా పరిగణించారు. కానీ ఆమెకు భారత్‌తో ఎటువంటి సంబంధాలు లేవు. గబ్బార్డ్ తల్లి హిందూ మతంలోకి మారి తన పిల్లలందరికీ హిందూ పేర్లను పెట్టింది.

Advertisement

Next Story

Most Viewed