US Elections: అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినేట్ లో చోటిస్తా

by Shamantha N |
US Elections: అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినేట్ లో చోటిస్తా
X

దిశ, నేషనల్ బ్యూరో: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్‌ మస్క్‌కు (Elon Musk) కేబినేట్ లో చోటిస్తానని అన్నారు. లేనిపక్షంలో సలహాదారుడిగానైనా నియమించుకుంటానని ట్రంప్ అన్నారు. అతడు చాలా తెలివైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. విద్యుత్‌ వాహనాలపై ఇస్తున్న 7,500 డాలర్ల ట్యాక్స్‌ క్రెడిట్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. విద్యుత్‌ వాహన విక్రయాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఇస్తోన్న ట్యాక్స్‌ క్రెడిట్‌ను రద్దు చేసే యోచనలో ట్రంప్‌ (Trump) ఉన్నారు. ట్యాక్స్‌ క్రెడిట్‌లు, పన్ను ప్రోత్సాహకాలు సాధారణంగా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశాలు కావని అభిప్రాయపడ్డారు. ఒకవేళ క్రెడిట్ రద్దు అమల్లోకి వస్తే.. మస్క్ కు ఉన్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు గణనీయమైన ఫలితాలు రావచ్చు.

కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెడతా- ట్రంప్

ట్రంప్ అధికారంలోకి వస్తే క్రెడిట్ రద్దు గురించి నిబంధనల్లో మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. లేదా దాన్ని పూర్తిగా రద్దు చేసేలా కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్‌ (Trump) తెలిపారు. అధిక ధరల వల్ల విద్యుత్తు కార్లకు అంతగా గిరాకీ లేదని అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పటికీ పెట్రోల్‌ కార్లు, హైబ్రిడ్ కార్లు ఇంకా కొత్తగా ఏది వచ్చినా వాటివైపు సానుకూలంగానే ఉన్నట్లు తెలిపారు. మస్క్‌కు (Musk) కీలక పదవి ఇస్తానని ట్రంప్‌ అనడం ఇది తొలిసారేం కాదు. 2016లో గెలిచిన సమయంలో రెండు కీలక సలహా మండళ్లకు మస్క్ ను ఎంపిక చేశారు. కానీ, పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలనే ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2017లోనే ఆయన రాజీనామా చేశారు.

రెడీగా ఉన్నా- మస్క్

తనను కేబినేట్ లోకి తీసుకుంటానన్న ట్రంప్‌ ప్రతిపాదనపై ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ’కి నేతృత్వం వహించేందుకు రెడీగా ఉన్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఆ పదవిలో ఉన్నట్లు.. ప్రసంగిస్తున్నట్లుగా ఉన్న ఓ ఫొటోని కూడా పోస్ట్‌ చేశారు. ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించి.. వృథాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్‌తో ఇటీవల జరిగిన చర్చలో మస్క్‌ ప్రతిపాదించారు.

Advertisement

Next Story

Most Viewed