ఢిల్లీ మార్చ్‌లో విషాదం: గుండెపోటుతో ఓ రైతు మృతి

by samatah |
ఢిల్లీ మార్చ్‌లో విషాదం: గుండెపోటుతో ఓ రైతు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో రైతులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. సంయుర్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), వివిధ సంఘాల పిలుపు మేరకు శుక్రవారం భారత్ బంద్ చేపట్టాయి. దీంతో పంజాబ్, హర్యానాలో దుకాణాలు, అనేక సంస్థలు మూసివేయబడ్డాయి. ఈ క్రమంలోనే హర్యానాలోని శంభు సరిహద్దులో నిరసన తెలుపుతున్న జియాన్ సింగ్(63) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. జియాన్ సింగ్‌కు చాతిలో నొప్పి రావడంతో పంజాబ్‌లోని సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాటియాలాలోని రాజేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన జియాన్ సింగ్ రెండు రోజుల క్రితం రైతుల మార్చ్‌లో పాల్గొనేందుకు శంభు సరిహద్దుకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు హర్యానా-పంజాబ్‌లోని శంభు సరిహద్దు వద్ద రైతులు మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. కొందరు రైతులు బ్యారీకేడ్ దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పంజాబ్‌లోని ఫజిల్కాలో భారత్ బంద్ ప్రభావం కనిపించింది. రైతులకు మద్దతుగా దుకాణాలు తెరుచుకోలేదు. ఫిరోజ్‌పూర్ హైవే ఓవర్‌బ్రిడ్జిని దిగ్బంధించి రైతు సంఘాలు ప్రదర్శన చేశారు.

Advertisement

Next Story