Toll tax: ప్రయాణించిన దూరానికే టోల్..పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం!

by vinod kumar |
Toll tax: ప్రయాణించిన దూరానికే టోల్..పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం!
X

దిశ, నేషనల్ బ్యూరో: టోల్ టాక్స్ వసూలు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శాటిలైట్ ఆధారిత నావిగేషన్ సిస్టమ్‌ల సహాయంలో టోల్ పన్ను వసూలు చేసేందుకు ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను కేంద్రం బుధవారం వెల్లడించింది. జాతీయ రహదారి-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్‌లో, జాతీయ రహదారి-709లోని పానిపట్-హిసార్ సెక్షన్‌లో పైలట్ ప్రాతిపదికన ఈ కాన్సెప్ట్‌ను అమలు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) విధానాన్ని ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ సదుపాయంతో పాటు పైలట్ ప్రాతిపదికన జాతీయ రహదారులలోని ఎంపిక చేసిన విభాగాల్లో అమలు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. జీఎన్ఎస్ ఎస్ ఆధారిత టోల్ సేకరణ అనేది ఒక అవాంతరాలు లేని పద్దతి. దీని ద్వారా ప్రయాణించే దూరం ఆధారంగా మాత్రమే ప్రయాణీకులకు చార్జ్ వసూలు చేయనున్నారు. ఈ పద్దతి అమలు చేయడం వల్ల రహదారులపై వాహనాలు సాఫీగా వెళ్లడానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుతం దీనిని పరిమిత సంఖ్యలోనే అమలు చేసి దాని ఫలితాల అనంతరం మిగతా స్థానాల్లో విస్తరించనున్నట్టు తెలుస్తోంది.



Next Story