సీజేఐకి న్యాయవాదుల లేఖ నేపథ్యంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ

by S Gopi |
సీజేఐకి న్యాయవాదుల లేఖ నేపథ్యంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయ, వృత్తిపరమైన ఒత్తిళ్లను ఉపయోగించి న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా వందలాది మంది న్యాయవాదులు, బార్ అసోసియేషన్లు భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఎదుటివారిని బుజ్జగించడం, బెదిరించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి. ఐదు దశాబ్దాల క్రితం వారు న్యాయవ్యవస్థ నిబద్ధత కోసం పిలుపునిచ్చారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎదుటివారి నుంచి నిబద్ధతను సిగ్గు లేకుండా కోరుకుంటారు. కానీ, దేశం పట్ల నిబద్ధతకు దూరంగా ఉంటారని ' ఎక్స్‌లో మోడీ ట్వీట్ చేశారు. కాబట్టి 140 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదని మోదీ అన్నారు.

రాజకీయ నాయకులకు సంబంధించిన అవినీతి కేసుల్లో స్వార్థ ప్రయోజనాల సమూహం న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, కోర్టుల పరువు తీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. అంతకుముందు రోజు సైతం ఆల్ మణిపూర్ బార్ అసోసియేషన్ సైతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసింది. అందులో న్యాయవ్యవస్థపై దాడులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అనవసర తర్కం, రాజకీయ అజెండాలతో న్యాయస్థానాలను అప్రతిష్టపాలు చేయడానికి స్వార్థ ప్రయోజనాల గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని, ఈ విషయంలో తాము ఆందోళన చెందుతున్నట్టు అసోసియేషన్ అభిప్రాయపడింది. ఇలాంటి ‘కఠినమైన సమయంలో’ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నాయకత్వం కీలకమని, సుప్రీంకోర్టు పటిష్టంగా నిలబడాలని, మౌనం పాటించాల్సిన సమయం కాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed