Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

by Mahesh Kanagandla |
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్(Encounter) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మావోయిస్టులు(Maoists) మరణించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదలైన కాల్పులు సుమారు ఆరు గంటలపాటు కొనసాగాయి. ఘటనాస్థలిలో ముగ్గురు మావోయిస్టులు విగతజీవులుగా కనిపించగా.. సెల్ఫ్ లోడెడ్ రైఫిల్(ఎస్ఎల్ఆర్), స్నైపర్ వెపన్, పిస్టల్, పేలుడు పదార్థాలను గుర్తించారు. మృతుల గుర్తింపును ఇంకా ధ్రువీకరించాల్సి ఉన్నది. ఎస్ఎల్ఆర్ వంటి అధునాతన ఆయుధం లభించడంతో మృతుల్లో ఒకరు సీనియర్ మావోయిస్టు నాయకుడై ఉంటారని అనుమానిస్తున్నారు.

బీజాపూర్ జిల్లా.. తెలంగాణతో సరిహద్దు పంచుకుంటుంది. ఈ జిల్లాలోని రేకపల్లి-కోమటిపల్లి అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అందించిన సమాచారంతో కోబ్రా, డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు ఉసూరు-బాసగూడ-పామేడ్ ఏరియాల్లో కూంబింగ్ ప్రారంభించారు. రేకపల్లి-కోమటిపల్లి అడవుల్లో వీరికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత స్పాట్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను రికవరీ చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర్రాజ్ తెలిపారు. ఎస్ఎల్ఆర్ సహా పలు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఎస్ఎల్ఆర్ ఆటోమేటిక్ ఆయుధం వాడుతున్నందున మృతుల్లో ఒకరు సీనియర్ మావోయిస్టు నాయకుడై ఉంటారని అభిప్రాయపడ్డారు. మృతుల వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉన్నదని వివరించారు. ఇదే ఏడాది మే నెలలో 12 మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన పేడియా ప్రాంతానికి సమీపంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది.

Advertisement

Next Story