మహిళలను వేధించే వాళ్ళను ఉరితీయాలి: సీఎం కేజ్రీవాల్

by Mahesh |
మహిళలను వేధించే వాళ్ళను ఉరితీయాలి: సీఎం కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ : మహిళలను వేధించే వాళ్ళను ఉరితీయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశం గర్వించేలా చేసిన రెజ్లర్ల పట్ల నిర్దయగా ఉండొద్దని కేంద్ర సర్కారుకు సూచించారు. గత వారం రోజులుగా దేశ రాజధానిలో స్టార్ రెజ్లర్లు నిరసన తెలిపే దుస్థితి రావడం బాధాకరమన్నారు. వారు దీక్ష చేస్తున్న ప్రదేశానికి విద్యుత్, నీరు నిలిపివేసి అవమానించేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ ఎఫ్ ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏడుగురు మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసన దీక్షకు కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెజ్లర్లకు తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. ఒక మైనర్‌ సహా ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల ఆధారంగా రెండు ఎఫ్‌ఐఆర్‌లలో పేరు నమోదైన డబ్ల్యూ ఎఫ్ ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ ను కేంద్రం కాపాడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఆరోపించారు.

అందుకే బ్రిజ్ భూషణ్ పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో కూడా జాప్యం జరిగిందని.. దీంతో మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సిన పరిస్థితి ఎదురైందని ఆయన చెప్పారు. "అన్నా హజారే ఈ నిరసన దీక్ష వద్దకు వచ్చి రాజకీయాలను మార్చారు. ఈ నిరసన ప్రదర్శన క్రీడా రంగంలో మార్పు తీసుకొస్తుంది. భారత దేశాన్ని ప్రేమించే వారు సెలవు తీసుకుని మరీ ఈ నిరసనలో పాల్గొనండి" అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేయడాన్ని రెజ్లర్లు స్వాగతించారు. ఆయనను అన్ని పదవుల నుంచి తొలగించి అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఇక తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించిన బ్రిజ్ భూషణ్ సింగ్.. తాను నేరస్థుడిని కానని, పదవి నుంచి వైదొలగాలని తేల్చి చెప్పారు. ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని వెల్లడించారు. రాజీనామా చేస్తే ఆరోపణలను అంగీకరించడమే అవుతుందని తెలిపారు. ఆ రెజ్లర్ల ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని బ్రిజ్ భూషణ్ కామెంట్ చేశారు.

Advertisement

Next Story