బీజేపీ ఫస్ట్ లిస్టులో ఆ నలుగురు మిస్సింగ్: వివాదాస్పద నేతలకు దక్కని చోటు!

by samatah |
బీజేపీ ఫస్ట్ లిస్టులో ఆ నలుగురు మిస్సింగ్: వివాదాస్పద నేతలకు దక్కని చోటు!
X

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ 195 మందితో మొదటి విడత అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఆచితూచి వ్యవహరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిని తప్పించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో ద్వేష పూరిత ప్రసంగాలు చేసిన పర్వేష్ వర్మ, జయంత్ సిన్హా, సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్, రమేష్ బిధూరిల పేర్లు మొదటి జాబితాలో లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వారు చేసిన వ్యాఖ్యలు ఏంటి? అవి ఎంతమేర వివాదాలను రేకెత్తించాయి? బీజేపీ వారిని పక్కన బెట్టడానికి గల కారణాలేంటి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సాద్వి ప్రజ్ఞా ఠాకూర్

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పార్లమెంటు స్థానంలో ప్రస్తుతం ప్రజ్ఞా ఠాకూర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే బీజేపీ రిలీజ్ చేసిన మొదటి జాబితాలో భోపాల్ సెగ్మెంట్ నుంచి అలోక్ వర్మ పేరు ప్రకటించింది. 2019 ఎన్నికలకు ముందు, అశోక్ చక్ర అవార్డు గ్రహీత, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరేను పౌరాణిక వ్యక్తులు రావణ్, కన్స్‌లతో పోల్చింది. దీంతో ఈసీ ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అంతేగాక మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను దేశ భక్తుడిగా కీర్తించారు. దీనిపై అనంతరం ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ ప్రధాని మోడీ సైతం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకే ప్రజ్ఞాను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.

రమేశ్ భిదూరి

చంద్రయాన్-3 మిషన్ విజయంపై చర్చ సందర్భంగా ఎంపీ డానిష్ అలీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అలీని లక్ష్యంగా చేసుకుని బిధూరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అలీపై అభ్యంతరకర పదజాలం వాడినందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బిధూరికి షోకాజ్ నోటీసు సైతం జారీ చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యాఖ్యలను పార్లమెంటరీ రికార్డుల నుంచి తొలగించినప్పటికీ, బిధూరి ప్రవర్తనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు బీజేపీ నేతలు ఖండించారు. అయితే ప్రచారంలో ప్రతిపక్షనేతలు బిధూరి వ్యాఖ్యలను హైలైట్ చేసే అవకాశం ఉందని, దీంతో బీజేపీ ప్రతిష్ట కాస్త దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రహించిన అధిష్టానం బిధూరీని తప్పించినట్టు సమాచారం.

పర్వేశ్ వర్మ, జయంత్ సిన్హా

ఢిల్లీలోని పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతున్న పర్వేశ్ శర్మ స్థానంలో కమల్ జీత్ సెహ్రావత్ ను బీజేపీ బరిలోకి దించింది. గతేడాది పర్వేశ్ ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ..పలువురు వ్యక్తులను దేశం నుంచి పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే ఆయన ఏ సంఘం పేరును స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ బీజేపీ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే కమల్ జీత్‌కు అవకాశం ఇచ్చినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు జార్ఖండ్‌లోని హజారీబాగ్ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న జయంత్ సిన్హాను తప్పించింది. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే మనీష్ జైష్వాల్‌ను బరిలోకి దింపింది. 2017లో ఓ మాంసం వ్యాపారిని కొట్టి చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు తాను ఆర్థిక సాయం అందించానని జయంత్ వ్యాఖ్యానించారు. అనంతరం ఆరుగురు నిందితులు బెయిల్ పై విడుదలయ్యాక నేరుగా జయంత్ ఇంటికి వెళ్లారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

పక్కా వ్యూహంలో భాగమే!

దేశంలో మూడో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ పక్కా వ్యూహంలో భాగంగానే వీరిని పక్కనపెట్టినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు వివాదాస్పద వ్యాఖ్యలను హైలేట్ చేస్తూ ప్రచారం నిర్వహించే చాన్స్ ఉందని బీజేపీ గ్రహించింది. దీంతో ఎక్కడా కూడా ఎటువంటి అభియోగాలు రాకూడదనే ఉద్దేశంతో వీరందరినీ తప్పించింది. అలాగే వివాదస్పద వ్యక్తులకు టిక్కెట్లు నిరాకరించడం వల్ల ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలను పాటించే వారికే బీజేపీ అవకాశం ఇస్తుందనే సందేశాన్ని కూడా ప్రజల్లోకి పంపనుంది.

Advertisement

Next Story