యుద్ధానికి ఇది సరైన సమయం కాదు..ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోడీ

by vinod kumar |
యుద్ధానికి ఇది సరైన సమయం కాదు..ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ సంక్షోభానికి యుద్ధభూమిలో పరిష్కారం కనుగొనలేమనే భారత వైఖరిని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పునరుద్ఘాటించారు. ఇది యుద్ధానికి సరైన సమయం కాదని దానివల్ల ఎటువంటి సమస్యలకు పరిష్కారాలను లభించబోవని స్పష్టం చేశారు. రష్యా పర్యటన అనంతరం ఆస్ట్రియా పర్యటనకు వెళ్లిన మోడీ బుధవారం ఆ దేశ చాన్స్‌లర్ కార్ల్ నెహమ్మర్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలోని పరిస్థితులపై కూడా డిస్కస్ చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ..యుద్ధంలో అమాయక ప్రజలను చంపడం ఆమోదయోగ్యం కాదన్నారు. భారత్, ఆస్ట్రియాలు చర్చలు, దౌత్యానికి ప్రాధాన్యత ఇస్తాయని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమైన మద్దతును అందించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దానిని ఏ విధంగానే సమర్థించబోమని నొక్కి చెప్పారు. తన మూడో టర్మ్ ప్రారంభంలోనే ఆస్ట్రియాను సందర్శించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.

వివిధ రంగాల్లో కలిసి పనిచేయడానికి నిర్ణయం

ఆవిష్కరణ, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీ, హైడ్రోజన్, నీరు, వ్యర్థాల నిర్వహణతో సహా వివిధ రంగాలల్లో భారత్, ఆస్ట్రియాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. వాతావరణ మార్పు, ఉగ్రవాదం వంటి ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకున్నారు. వాతావరణానికి సంబంధించి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బయో ఫ్యూయల్ అలయన్స్ వంటి కార్యక్రమాలలో చేరాలని ఆస్ట్రియాను మోడీ ఆహ్వానించారు.

ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు: నెహమ్మర్

ఆస్ట్రియా చాన్సలర్ నెహమ్మర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. ఇండియా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోందని గుర్తు చేశారు. భారతదేశానికి నమ్మకమైన భాగస్వామిగా ఉండటమే కాకుండా, ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారాన్ని కూడా ఆస్ట్రియా కోరుకుంటోందని చెప్పారు. భారత్, ఆస్ట్రియాల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తోడ్పడతామని చెప్పారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెతోనూ మోడీ భేటీ అయ్యారు.

Advertisement

Next Story