China: డేటింగ్‌కి వెళ్లే ఉద్యోగులకు క్యాష్ ఆఫర్ చేస్తున్న చైనా కంపెనీ

by S Gopi |
China: డేటింగ్‌కి వెళ్లే ఉద్యోగులకు క్యాష్ ఆఫర్ చేస్తున్న చైనా కంపెనీ
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొంతకాలంగా చైనా జనాభా సంక్షోభం, తక్కువ పెళ్లిళ్లతో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో అక్కడి కంపెనీలు సమస్యను పరిష్కరించేందుకు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా ఓ కంపెనీ తమ ఉద్యోగుల్లో సింగిల్‌గా ఉన్న వారు డేటింగ్‌కి వెళ్లేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. దీనికోసం సౌత్ చైనాలోని షెన్‌జెన్‌లో టెక్ కంపెనీ ఇన్‌స్టా360 కొత్త పాలసీని తీసుకొచ్చింది. డేటింగ్‌కి వెళ్లే సింగిల్ ఉద్యోగులకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. కంపెనీకి చెందిన ప్లాట్‌ఫామ్‌లో డేటింగ్ కోసం పోస్ట్ పెట్టే వారికి 66 యువాన్‌లు(మన కరెన్సీలో రూ. 769) నగదు ప్రోత్సాహం ఆఫర్ చేసింది. ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సదరు ఉద్యోగి ఎవరితోనైనా మూడు నెలల పాటు డేటింగ్ కొనసాగిస్తే 1,000 యువాన్ (సుమారు రూ. 11,640) కూడా రివార్డ్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. 'ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించేందుకు, హ్యాపినెస్ కోసం కంపెనీ ఈ చొరవ తీసుకుంది. ఇప్పటివరకు ఉద్యోగులు దాదాపు 500 పోస్ట్‌లు షేర్ చేశారని, వారికి 10,000 యువాన్ల వరకు నగదును ఇచ్చినట్టు' కంపెనీ ప్రతినిధి చెప్పారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. జనాభా నియంత్రణకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అక్కడ పెళ్లిళ్లు తగ్గిపోయాయి. గణాంకాల ప్రకారం, చైనాలో పెళ్లిళ్లు గతేడాది కంటే 16.6 శాతం తక్కువగా జరిగాయి. జననాల రేటు కూడా 2023లో దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది.

Advertisement

Next Story

Most Viewed