సరికొత్త అధ్యాయం లిఖిస్తా: ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Swamyn |
సరికొత్త అధ్యాయం లిఖిస్తా: ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తాను మూడోసారి గెలిస్తే మహిళా శక్తి అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం లిఖిస్తానని ప్రధాని మోడీ తెలిపారు. మహిళా కేంద్రంగా సరికొత్త పథకాలు తీసుకొస్తానని చెప్పిన ఆయన.. మహిళల స్థాయిని పెంచి, వారికి అవకాశాలను కల్పించే సమాజమే ముందుకు సాగుతుందని వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ‘సశక్త్ నారీ-వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో మరోసారి బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళల జీవితాలు, వారి కష్టాలను గత ప్రభుత్వాలు విస్మరించాయని, కానీ, తమ ప్రభుత్వం మాత్రం ప్రతి దశలోనూ వారికి అండగా నిలుస్తోందని చెప్పారు. మరుగుదొడ్లు లేకపోవడం, శానిటరీ ప్యాడ్‌ల వాడకం, కలప, బొగ్గు వల్ల వంటగది నుంచి వెలువడే పొగ కలిగించే ప్రతికూల ప్రభావాలు, బ్యాంకు ఖాతాల అవసరం వంటి మహిళలకు సంబంధించిన అనేక సమస్యల గురించి ఎర్రకోట వేదికగా మాట్లాడిన తొలి ప్రధానిని తానేనంటూ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ వంటి పార్టీలు దీన్ని కూడా ఎగతాళి చేసి, తనను అవమానించాయని తెలిపారు. తన ఇంట్లో, చుట్టు పక్కల ఇళ్లలో, గ్రామాల్లో చిన్నప్పటి నుంచి చూస్తున్న పరిస్థితుల ఆధారంగా మహిళల కోసం పథకాలు తీసుకొస్తున్నామని వెల్లడించారు. వివిధ పథకాల ద్వారా రూ.8లక్షల కోట్లకు పైగా నగదు మహిళలకు అందజేశామని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు కోటి మందికి పైగా మహిళలు ‘లాఖ్‌పతి దీదీలు’ అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా స్వయం సహాయక గ్రూపుల(ఎస్‌హెచ్‌జీ) బ్యాంకు ఖాతాల్లోకి రూ.8వేల కోట్లు జమచేశారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు.


Advertisement

Next Story

Most Viewed