మూడో రోజూ రైతుల నిరసన: పలు రైళ్ల నిలిపివేత

by samatah |
మూడో రోజూ రైతుల నిరసన: పలు రైళ్ల నిలిపివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన నిరసన మూడో రోజూ కొనసాగుతోంది. హర్యాణాలోని శంభు సరిహద్దులో వేల మంది రైతులు మార్చ్ నిర్వహిస్తున్నారు. శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో హర్యానా భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ రైతులు రైల్ రోకోకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పంజాబ్‌లో రైలు ట్రాక్‌లపై కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే హర్యానా. యూపీ నుంచి ఢిల్లీకి వెళ్లే సరిహద్దులు వరుసగా మూడో రోజు కూడా ఉద్రిక్తంగా మారాయి. రైతులను ఢిల్లీలోకి రాకుండా చేసేందుకు ఢిల్లీ పోలీసులు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే 30వేల టియర్ గ్యాస్ షెల్స్ ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో నిరసనలు ట్రాఫిక్‌ను ప్రభావితం చేయడంతో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విద్యార్థులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఒక అడ్వైజరీని జారీ చేసింది. వీలైతే మెట్రోలో ప్రయాణించాలని సూచించింది. కాగా, ముగ్గురు కేంద్రమంత్రులు రైతు నేతలతో ఈరోజు సాయంత్రం 5గంటలకు సమావేశం కానున్నారు. 7 రోజుల్లో ఇరుపక్షాల మధ్య ఇది ​​మూడో సమావేశం కావడం గమనార్హం. మరోవైపు రైతుల ఉద్యమం కారణంగా ఫిబ్రవరి 18, 22 తేదీల్లో జరగాల్సిన రెండు భారీ ర్యాలీలను ఆమ్ ఆద్మీ పార్టీ రద్దు చేసుకుంది.

Advertisement

Next Story