వారు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేదు: ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ పైర్

by samatah |
వారు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేదు: ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ పైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నవారు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారని, దాని వల్ల సొంత సంస్కృతిని చూసి సిగ్గుపడే పరిస్థితి నెలకొందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసోం పర్యటనలో ఉన్న మోడీ ఆదివారం గువహటిలో రూూ.11,600కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘దేశంలోని తీర్థయాత్రలు, దేవాలయాలు, విశ్వాస స్థలాలు కేవలం సందర్శనీయ స్థలాలు మాత్రమే కాదు. వేల ఏళ్ల మన నాగరికత ప్రయాణానికి చిహ్నాలు’ అని చెప్పారు. ఏ దేశం తన గతాన్ని చెరిపివేయడం ద్వారా అభివృద్ధి చెందబోదన్నారు. కానీ గత పదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. అసోంలో ఆవిష్కరించిన ప్రాజెక్టులు ఈశాన్య ప్రాంతంలోనేగాక దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలకూ అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో శాంతి నెలకొందని, 7,000 మందికి పైగా ప్రజలు తమ ఆయుధాలను పక్కన బెట్టి జనజీవనంలోకి తిరిగి వచ్చారని గుర్తు చేశారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు ఆరు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, నేడు 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు.

ఆలయాలపైనే ఫోకస్

తీర్థయాత్రలను సందర్శించే ప్రజలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడంపై మోడీ ప్రధాన దృష్టి సారించారు. ఈ క్రమంలో రూ. 498 కోట్ల విలువైన కామాఖ్య ఆలయ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (పీఎం-డివైన్) పథకం ద్వారా ఈ కారిడార్ మంజూరు చేశారు. అంతేగాక రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలకు ఊతమిచ్చేందుకు, చంద్రపూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా స్టేడియం, నెహ్రూ స్టేడియంను ఫిఫా స్టాండర్డ్ ఫుట్‌బాల్ స్టేడియంగా అప్‌గ్రేడ్ చేయడం వంటి వాటికి మోడీ శంకుస్థాపన చేశారు. కాగా, ఎన్నికలకు ముందు మోడీ ఈశాన్య రాష్ట్రంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story