పూరి రత్నభండాగారంలో తెరుచుకున్న మూడో రహస్య గది!

by Ramesh Goud |   ( Updated:2024-07-18 08:24:09.0  )
పూరి రత్నభండాగారంలో తెరుచుకున్న మూడో రహస్య గది!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలోని పూరి రత్న భాండాగారం మరోసారి తెరుచుకుంది.దీంతో పూరి జగన్నాధుడి దర్శనానికి బ్రేక్ పడింది. ఈ నెల 14న పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్నభండార్ లో ఉన్న మూడు రహస్య గదుల్లో రెండు గదులను తెరిచి సంపదను ప్రభుత్వం తాత్కలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ రత్న భాండాగారం అధ్యయన కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ నేతృత్వంలో మూడో గదిని కూడా తెరిచారు. రత్నభండార్ లోని ఈ రహస్య గదిని తెరుస్తున్న కారణంగా భక్తులకు ప్రవేశ అనుమతిని నిలిపివేస్తున్నట్లు ఆలయ పాలక మండలి ప్రకటన విడుదల చేసింది. ఈ రహస్య గదిలోని విలువైన సంపదను తాత్కలిక స్ట్రాంగ్ రూంకు తరలించనున్నారు.

ఈ కార్యక్రమం మొత్తాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారులు చిత్రీకరించనున్నారు. జగన్నాధుడి నిధిని తరలించిన తర్వాత ఈ రత్నభండార్ ను మరమ్మత్తుల కోసం పురావస్తు శాఖ అధికారులకు అప్పగించనున్నారు. మరమ్మత్తులు పూర్తి అయిన అనంతరం స్ట్రాంగ్ రూంల నుంచి నిధిని మళ్లీ రత్నభండార్ కు తరిలించి లెక్కింపు చేపట్టనున్నారు. 46 ఏళ్ల తర్వాత రత్నభండార్ ను తెరిచి నిధి లెక్కింపు చేపట్టనుండగా.. జగన్నాధుడి సంపదకు సంబందించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ రత్నభండార్ లోని నిధికి సంబందించిన మూడో గదిని ఇప్పటివరకు ఒక్కసారి కూడా తెరవలేదని అధికారులు వెల్లడించారు. రహస్య గది లెక్కింపుకు 30 నుంచి 40 రోజుల సమయం పట్టవచ్చని ఒడిశా న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story