Hijab: హిజాబ్‌‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

by Harish |
Hijab: హిజాబ్‌‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని ఒక కళాశాల క్యాంపస్‌లో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ యాజమాన్యం ఇచ్చిన సర్క్యూలర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇటీవల చెంబూర్‌లోని ఎన్‌జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థులు హిజాబ్ ధరించకూడదని యాజమాన్యం ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. దీంతో కొంతమంది విద్యార్థులు దీన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. హైకోర్టు, కాలేజీ నిర్ణయాన్ని సమర్థించింది. దీనిపై విద్యార్థులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.

దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం, కాలేజ్ ఇచ్చిన సర్క్యూలర్‌‌పై స్టే విధించింది. విద్యార్థుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కోలిన్ గోన్సాల్వేస్ మాట్లాడుతూ కాలేజీలో నాలుగేళ్లుగా హిజాబ్ ధరిస్తున్నా, ఎలాంటి సమస్య లేదని, అయితే "అకస్మాత్తుగా" కళాశాల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని వాదించారు. విచారణ సందర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది, అమ్మాయిలకు వారు ధరించే దుస్తులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. వారు ఏం ధరించాలో కాలేజీలు నిర్ణయిస్తే మహిళా సాధికారికత ఎలా సాధ్యమవుతుందని కాలేజీని ప్రశ్నించింది.

దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఈ విషయం మీకు తెలియదా? పేర్లల్లో కూడా మతం ఉంటుంది.. మరి దాన్ని ఎలా తొలగిస్తారని కళాశాల యాజమాన్యాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న కూడా ఇప్పటికీ ఇలాంటి అంశాలపై చర్చ జరగడం దురదృష్టకరం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్యాంపస్‌లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలకు అనుమతి లేదని తెలిపింది. తాము ఇచ్చిన ఆదేశాలను దుర్వినియోగం చేయకూడదని సూచిస్తూ, తదుపరి విచారణను కోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది.

Advertisement

Next Story