సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు ఆ గ్యాంగ్ పనే?.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

by samatah |
సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు ఆ గ్యాంగ్ పనే?.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్రూపునకు చెందిన వారని తెలిపారు. అందులో ఒక నిందితుడిని హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన విశాల్‌గా గుర్తించారు. ఆయనకు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు రోహిత్ గోదారాతో సంబంధమున్నట్టు పోలీసులు తెలిపారు. అంతేగాక విశాల్‌పై హత్య, దోపిడీలకు సంబంధించిన ఐదు క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు. గురుగ్రామ్, ఢిల్లీల్లో ఈ కేసులు నమోదయ్యాయి. గురుగ్రామ్‌కు చెందిన వ్యాపారవేత్త సచిన్ ముంజాల్‌ను గత నెలతో హత్య చేయగా ఇందులో విశాల్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలో గురుగ్రామ్‌లోని విశాల్ ఇంట్లో సోదాలు చేసేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం సోమవారం వెళ్లింది. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. అయితే మరో వ్యక్తి పేరు ఇంకా వెల్లడించలేదు. కాగా, గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు పలు మార్లు బెదిరింపులు ఎదురయ్యాయి. 1998లో కృష్ణ జింకను వేటాడినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్‌కు భద్రతను పెంచారు. ఈ క్రమంలోనే తాజా కాల్పులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Advertisement

Next Story