వరల్డ్ బ్యాంక్‌ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-03 14:42:17.0  )
వరల్డ్ బ్యాంక్‌ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి!
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖరారైంది. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో బుధవారం నామినేషన్లు ముగిశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా డేవిడ్ మాల్సాస్ కొనసాగుతున్నారు. అయితే, ఆయన పదవీకాలం ఒక సంవత్సరం ఉండగా.. ముందస్తుగా మాల్సాస్ పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి ప్రతిపాదించారు.

సాధారణంగా అమెరికా ప్రతిపాదించిన వ్యక్తికే ప్రపంచ బ్యాంక్ నాయకత్వ బాధ్యతలు దక్కుతూ వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న డేవిడ్ మల్సాస్‌ను 2019లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించే వ్యక్తిగా బంగాను ప్రకటించినప్పుడు బైడెన్ ఈ చరిత్రలో క్లిష్టమైన సమయంలో ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడని చెప్పారు. వాషింగ్టన్‌కు చెందిన ప్రపంచ బ్యాంక్ ఫిబ్రవరి నెల చివరి వారంలో నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

అజయ్ బంగా తన నామినేషన్‌కు మద్దతు కోసం గతనెలలో ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించారు. ఈ క్రమంలో భారతదేశంలోనూ పర్యటించారు. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్‌పాస్ జూన్‌లో ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. ఆ తరువాత అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవి కోసం నామినేట్ అయిన తొలి భారత సంతతి వ్యక్తి అంజయ్ బంగా కావడం గమనార్హం.

Advertisement

Next Story