పిల్లలకు పీచు మిఠాయి కొనిస్తున్నారా.. ప్రాణాలకే ప్రమాదం

by Swamyn |
పిల్లలకు పీచు మిఠాయి కొనిస్తున్నారా.. ప్రాణాలకే ప్రమాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయి(కాటన్ క్యాండీ)లో ప్రాణాంతక క్యాన్సర్ కారకాలు బయటపడ్డాయి. చిన్నారులను ఆకర్షించేలా గులాబీ(పింకు), ఆకుపచ్చ రంగుల్లో లభించే ఈ కాటన్ క్యాండీని తింటే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టేనని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ కారణంతోనే తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో పీచు మిఠాయి అమ్మకాలపై ఇటీవలే నిషేధం విధించింది. వీటి తయారీ, విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ కాటన్‌ క్యాండీపై నిషేధం అమల్లో ఉంది.

కాటన్ క్యాండీ చరిత్ర

పీచు మిఠాయిని అమెరికాకు చెందిన దంతవైద్యుడు విలియం మోరిసన్, మిఠాయి వ్యాపారి జాన్ సీ వార్టన్‌తో కలిసి 1897లో కనిపెట్టారు. దీనిని మొదట ఫెయిరీ ఫ్లాస్ అనే పేరుతో పిలిచేవారని తమిళనాడుకు చెందిన చెఫ్, ఆహార చరిత్రకారుడు రాకేష్ రఘునాథన్ తెలిపారు. అయితే, అప్పుడే పండించిన పత్తిలా తెల్లగా కనిపించడంతో, కాలక్రమేణా దాని పేరు కాటన్ క్యాండీగా మారిందని తెలిపారు.

ఖర్చు తగ్గించుకోవడానికి కృత్రిమ రంగులు

తొలినాళ్లలో కాటన్ క్యాండీ తయారీలో క్లోరోఫిల్ (ఆకుపచ్చ), కెరోటినాయిడ్ (పసుపు, నారింజ లేదా ఎరుపు), ఆంథోసైనిన్ (నీలం) వంటి మొక్కల ఆధారిత రంగులను ఉపయోగించేవారు. కానీ, ఈ రంగులు ఎక్కువకాలం ఉండకపోవడంతో అవి చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించేవి కాదు. ఈ క్రమంలోనే సింథటిక్ ఫుడ్ కలర్స్‌కు ఆదరణ పెరగడంతో వాటిని పీచు మిఠాయిలోనూ వాడారు. సింథటిక్ కలర్లను ఆహార భద్రత చట్టానికి లోబడి సరైన పరిణామంలో ఉపయోగిస్తే.. అది సురక్షితమైనదే. అది సురక్షితమైనదే. కానీ, దీని ధరలు ఎక్కువగా ఉండటంతో కాటన్ క్యాండీ తయారీదారులు ఖర్చులను తగ్గించుకునేందుకు అసురక్షిత రంగులను ఉపయోగించడం మొదలుపెట్టారని తమిళనాడుకు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.

ఏ కెమికల్ ఉందో తెలుసా ?

పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు తమిళనాడు ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు ఇటీవల చెన్నై నగరవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అప్పుడు సేకరించిన పీచు మిఠాయి శాంపిల్స్‌ను అధ్యయనం చేయగా.. కాటన్‌ క్యాండీల్లో ‘రోడమైన్‌-బి’ అనే కెమికల్‌ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వాడుతున్నారని తేలింది. సాధారణంగా ‘రోడమైన్‌-బి’ని ‘ఇండస్ట్రియల్‌ డై’గా పిలుస్తారు. దుస్తుల కలరింగ్‌, పేపర్‌ ప్రింటింగ్‌లో దీన్ని వాడుతుంటారు. ఫుడ్‌ కలరింగ్‌ కోసం దీన్ని వాడకూడదు. పీచు మిఠాయిలోని ఇలాంటి ప్రమాదకర కెమికల్‌ వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే రిస్క్ ఉంటుందని ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్‌ పనితీరుపైనా ప్రభావం చూపిస్తుందన్నారు. అల్సర్‌ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు.


Advertisement

Next Story