Rain Alert: ఢిల్లీ, ముంబై, గుజరాత్‌లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక

by Harish |
Rain Alert: ఢిల్లీ, ముంబై, గుజరాత్‌లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని గత కొద్ది రోజులుగా వర్షాలు వదలడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు వరదల ప్రవహిస్తుంది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ, వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గురువారం కూడా ఢిల్లీలో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) అంచనా వేసింది. అలాగే, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, విదర్భ, జార్ఖండ్ మొదలైన ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైని కూడా రెండు రోజులుగా వర్షాలు వదలడం లేదు. గురువారం నగరం, శివారు ప్రాంతాల్లోని కీలక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే నగర ప్రజలు వర్షాలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం ఉంది. నగరంలో గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

Next Story