'షిండే వర్గంపై అనర్హత వేటు వేయండి'

by Vinod kumar |
షిండే వర్గంపై అనర్హత వేటు వేయండి
X

ముంబై: బీజేపీతో పొత్తు పెట్టుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్‌నాథ్ షిండే, ఆయన వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టింది. గతేడాది జూన్‌లో శివసేనను చీల్చిన షిండే నాటి నుంచి సీఎంగా కొనసాగుతున్నారు. షిండేతో పాటు శివసేన చీలిక వర్గానికి చెందిన ఇతర ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అవిభక్త శివసేన చీఫ్‌విప్ సునీల్ ప్రభు 2022 మే 11వ తేదీనే స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను కోరినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

అనర్హత వేటు వేయడంపై స్పీకర్ ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేయడంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం కోర్టు తన అధికారాన్ని ఉపయోగించి నిర్ణీత వ్యవధిలో అనర్హత వేటు వేసేటట్లు స్పీకర్‌ను ఆదేశించాలని ఉద్ధవ్ తరఫు న్యాయవాది నిశాంత్ పాటిల్ కోర్టును కోరారు. పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని అత్యున్నత న్యాయస్థానం మే 11వ తేదీన తీర్పులో ఆదేశించినా స్పీకర్ పట్టించుకోలేదని పిటిషనర్ ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed