జమ్ములోని సుంజన్వాన్ ఆర్మీ బేస్ క్యాంపుపై కాల్పులు

by Shamantha N |   ( Updated:2024-09-02 09:52:37.0  )
జమ్ములోని సుంజన్వాన్ ఆర్మీ బేస్ క్యాంపుపై కాల్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ముందు జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. జమ్ములోని అతిపెద్ద ఆర్మీ స్థావరంపై ముష్కరులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో సెంట్రీ డ్యూటీలో ఉన్న జవాన్ గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సుంజన్వాన్ ఆర్మీ బేస్ కు సీల్ వేశారు. అక్కడ హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల్లో కాల్పులు జరుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. 2018 ఫిబ్రవరిలోనూ సుంజ్వాన్‌ మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో ఆరుగురు జవాన్లు, ఓ పౌరుడు చనిపోయాడు. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

చొరబాటుకు యత్నించిన ముష్కరులు

ఆగస్ట్ 31న జమ్ముకశ్మీర్‌ బందిపొరా జిల్లాలోని గురేజ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (LOC) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉగ్రవాదుల కదలికను గమనించిన ఆ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. అప్పుడు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. సెప్టెంబరు 18న తొలి విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల వేళ ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇప్పటికే నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed