ఉద్రిక్తతల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు: భారత్-చైనా సంబంధాలపై జైశంకర్

by samatah |
ఉద్రిక్తతల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు: భారత్-చైనా సంబంధాలపై జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-చైనా మధ్య తాజా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఏ దేశానికీ ఉపయోగం లేదని వెల్లడించారు. భారత్-చైనా సంబంధాలు మెరుగుపడాలంటే వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాలను తగ్గించి, ఇప్పటికే ఉన్న ఒప్పందాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘ఎల్ఏసీ వద్ద ఎక్కువ సైన్యం ఉండొద్దని భావిస్తున్నాం. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను అమలు చేయాలి. ఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. గత నాలుగేళ్లుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఇరు దేశాలకూ ఎటువంటి ఉపయోగం లేదు’ అని వ్యాఖ్యానించారు. సరిహద్దు వివాదాలను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను న్యాయంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

పరిష్కారం ఉందని నమ్మడం తప్పనిసరి

ప్రపంచంలో అనేక దేశాల మధ్య సరిహద్దు వివాదం ఉందని గుర్తు చేసిన జైశంకర్.. వాటిని పరిష్కరించుకోవడం ఎంతో ముఖ్యం అని తెలిపారు. పరిష్కారం ఉందని నమ్మడం ప్రతి దేశానికీ తప్పనిసరి అని అన్నారు. ఎక్కువ సీట్లు గెలిస్తే ఈ సమస్యపై మాట్లాడటానికి మరింత అధికారం లభిస్తుందా అనే ప్రశ్నకు జైశంకర్ సమాధానమిస్తూ.. సరిహద్దు పరిష్కారానికి ఎన్ని సీట్లు గెలిచామనే దానితో సంబంధం లేదన్నారు. రాజకీయంగా మెజారిటీ ఉందా లేదా అన్నది సమస్య కానే కాదని స్పష్టం చేశారు. న్యాయమైన ఒప్పందాలు చేసుకోవడమే సరైందని వెల్లడించారు. కాగా, 2020లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత భారత్-చైనా దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

Advertisement

Next Story

Most Viewed