అధికారంలోకి వస్తే.. కోటి ఉద్యోగాలిస్తామంటూ ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో

by Hajipasha |
అధికారంలోకి వస్తే.. కోటి ఉద్యోగాలిస్తామంటూ ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో
X

దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష పార్టీలు ‘ఇండియా కూటమి’తో ఏకమైనప్పటికీ.. హామీలిచ్చే విషయంలో మాత్రం తీరొక్క వైఖరితో ముందుకు సాగుతున్నాయి. తాజాగా శనివారం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అగ్రనేత తేజస్వి యాదవ్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఉద్యోగాల భర్తీ, రూ.500కి వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ, కులగణన సహా మొత్తం 24 హామీలను ఈ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బిహార్‌కు రూ.1.60 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడంతో పాటు రాష్ట్రంలో ఐదు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయిస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి దేశంలోని యువతకు మంచి రోజులు మొదలవుతాయని, వారికి మెరుగైన ఉద్యోగ అవకాాశాలు లభిస్తాయని తేజస్వి యాదవ్ చెప్పారు. ‘‘ఈ మేనిఫెస్టో ఆర్జేడీదా ? ఇండియా కూటమిదా ?’’ అని విలేకరులు ఆయనను ప్రశ్నించగా.. ‘‘మేం ‘పరివర్తన్ పత్ర’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశాం. ఇండియా కూటమి నుంచి స్ఫూర్తి పొంది దీన్ని రెడీ చేశాం. మా పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు కూడా ఇండియా కూటమి ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘2004లో డాక్టర్ మన్మోహన్ సింగ్ మా మద్దతుతో ప్రధానిగా నియమితులయ్యారు. మేం ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నాం. అందుకే మా మేనిఫెస్టోకు దేశ ప్రజల అంగీకారం ఉంటుంది’’ అని తేజస్వి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed