Heart Attack: గుండెపోటుతో బాలుడు మృతి.. నెలరోజుల్లో నలుగురు

by Rani Yarlagadda |
Heart Attack: గుండెపోటుతో బాలుడు మృతి.. నెలరోజుల్లో నలుగురు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు (Heart Attack Deaths) పెరుగుతున్నాయి. పదేళ్లు, రెండు పదుల వయసైనా నిండని పిల్లలు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. అలీఘర్ జిల్లాలో మోహిత్ చౌదరి అనే టీనేజర్.. స్కూల్ లో క్రీడల పోటీల కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ కుప్పకూలిపోయాడు. డిసెంబర్ 7న మోహిత్ చదువుతున్న స్కూల్లో ఆటల పోటీలు జరగనున్నాయి. రన్నింగ్ కాంపిటేషన్ లో పాల్గొనేందుకు.. సిరౌలి గ్రామంలో తన స్నేహితులతో కలిసి రెండు రౌండ్లు పరిగెత్తాడు. కాసేపటికీ స్పృహ కోల్పోవడంతో.. స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మోహిత్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో మోహిత్ తండ్రి రోడ్డుప్రమాదంలో మరణించారు. ఇప్పుడు మోహిత్ కూడా చనిపోవడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మూడు నెలల వ్యవధిలో తండ్రి, కొడుకుల మరణాలు ఆ గ్రామస్తులను కలచివేశాయి. అలీఘర్ లోనే 20 ఏళ్ల అమ్మాయి కూడా గుండెపోటుతో మరణించింది. గడిచిన 25 రోజుల్లో కనీసం ముగ్గురు యువత గుండెపోటుకు గురయ్యారు. లోధీ నగర్‌లో ఆడుకుంటూ ఎనిమిదేళ్ల బాలికకు గుండెపోటు రాగా, పనికి సిద్ధమవుతుండగా ఓ వైద్యురాలు గుండెపోటుతో మృతి చెందింది. నవంబర్ 20న, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (AMU) మాజీ వైస్ ఛాన్సలర్ SM అఫ్జల్ కుమారుడు సయ్యద్ బర్కత్ హైదర్ గుండెపోటుతో మరణించారు. సెప్టెంబరులో.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని తన పాఠశాలలో ఆడుకుంటూ 9 ఏళ్ల విద్యార్థిని గుండెపోటుతో మరణించింది.

Advertisement

Next Story