Democratic Convention Farewell: కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

by Shamantha N |
Democratic Convention Farewell: కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటతడి పెట్టుకున్నారు. చికాగాలో జరుగుతున్న పార్టీ సభలో ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. బైడెన్ వేదికపైకి రాగానే ఆయన కుమార్తె యాష్లీ బైడెన్ తన తండ్రిని పరిచయం చేస్తూ మాట్లాడారు. ‘ మా నాన్ని ఆడపిల్లల పక్షపాతి. మహిళలను నమ్మడం, వారికి విలువ ఇవ్వడం నేను చూశారు’ అని పేర్కొన్నారు. ఈ మాటలకు బైడెన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యి కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఐ లవ్ యూ అమెరికా అంటూ ఆయన ప్రసంగం ప్రారంభించారు.

ట్రంప్ పై విమర్శలు

బైడెన్ మాట్లాడుతూ ‘‘అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అమెరికాను కాపాడేందుకు పోరాడుతున్నాం. అమెరికా గౌరవం ముఖ్యం. ఇక్కడ విద్వేషానికి చోటు లేదు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మౌలిక వసతులు లేకుండా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా నిలవగలం. ట్రంప్‌ నాలుగేళ్లలో ప్రతివారం మౌలిక వనరులపై వాగ్దానాలు చేస్తూ వెళ్లారు. కానీ, పూర్తి చేయలేదు. కానీ, మనం రోడ్లు, వంతెనలు, పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, రైళ్లు, బస్సులను ఆధునికీకరించాం. అందరికీ అందుబాటులో హైస్పీడ్‌ నెట్‌ తీసుకొచ్చాం. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చాం. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కృషి చేశాం. జీవన ప్రమాణాలను పెంచాం.” అని అన్నారు. పతనమవుతున్న దేశంగా అమెరికాను ట్రంప్‌ పేర్కొన్నారు. ఇలా మాట్లాడి ప్రపంచదేశాలకు ఏం సందేశం పంపుతున్నారు అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చిన్నారులు తుపాకీ కాల్పులకు బలవుతున్నారని పేర్కొన్నారు. అందుకే తుపాకుల చట్టాన్ని తెచ్చానని.. అందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. మారుణాయుధాలను నిషేధించాల్సిన సమయం ఆసన్నమైందని బైడెన్‌ పిలుపునిచ్చారు.

అధ్యక్ష అభ్యర్థి గురించి ఏమన్నారంటే?

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆమె రన్నింగ్ మేట్ టిమ్ వాల్జ్ పై బైడెన్ ప్రశంసలు కురిపించారు. తన ముంగింపు ప్రసంగంలో వారి గురించి మాట్లాడారు. హ్యారిస్- టిమ్ తన బాధ్యతలను కొనసాగిస్తారని అన్నారు. తన అత్యుత్తమ సేవలను 50 ఏళ్లుగా అమెరికాకు అందించానని తెలిపారు. దానికి బదులుగా లక్షలాది మంది అభిమానం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. హ్యారిస్- టిమ్ ల గొప్ప వాలంటీర్ గా పనిచేస్తానని అన్నారు. ఆతర్వాత బైడెన్ కుటుంబసభ్యులు, కమలా హ్యారిస్, టిమ్ వాల్జ్ వేదికపైకి వచ్చి బైడెన్ ని అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed