May Day: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం..

by Vinod kumar |
May Day: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం..
X

చెన్నై: మే డే రోజున తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కార్మికుల రోజువారీ పని వ్యవధిని 8 గంటల నుంచి 12 గంటలకు పొడిగిస్తూ పది రోజుల కిందటే (ఏప్రిల్ 21న) అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. “బిల్లును ఉపసంహరించుకోవడాన్ని నేను అవమానంగా భావించను. దీన్ని కూడా గర్వకరమైన విషయంగా భావిస్తున్నాను. ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఎంత ధైర్యం ఉండాలో .. దానిని ఉపసంహరించుకోవడానికి కూడా అంతే ధైర్యం ఉండాలి" అని ఈసందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకించిన తమ మిత్రపక్షాలను ఆయన అభినందించారు.

డీఎంకే ప్రజాస్వామిక విధానాలకు ఇదొక ఉదాహరణ అని స్టాలిన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిరంకుశ సాగు చట్టాలు రద్దు కావడానికి.. ఢిల్లీలో రైతులు చెమటోడ్చాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తాము కార్మిక సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని.. వారి సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. కాగా, అనేక రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నిరసనల నేపథ్యంలో ఈ చట్టం అమలును నిలుపుదల చేస్తున్నట్లు ఏప్రిల్ 24నే తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story