Karunanidhi : బీజేపీతో పొత్తు చర్చలా తూచ్.. డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టీకరణ

by Hajipasha |
Karunanidhi : బీజేపీతో పొత్తు చర్చలా తూచ్.. డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టీకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీతో డీఎంకే పొత్తు చర్చలు జరుపుతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు. అవన్నీ వదంతులేనని ఆయన తేల్చి చెప్పారు. సోమవారం చెన్నైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ‘‘కళైంగర్ మెమోరియల్‌కు రావాలని మేం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను బలవంతం చేయలేదు. ఆయనంతట ఆయనే వచ్చారు’’ అని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఆదివారం రోజు కరుణానిధి శత జయంతి ఉత్సవాల సందర్భంగా 100 రూపాయల స్మారక నాణేన్ని స్వయంగా రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ సంతోషాన్ని తట్టుకోలేక తనకు ఆదివారం రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదని స్టాలిన్ పేర్కొన్నారు.

‘‘మా నాన్న (కరుణానిధి) గురించి రాజ్‌నాథ్ సింగ్ చాలా గొప్పగా చెప్పారు. ఆ విధంగా మా ఇండియా కూటమి నేతలు, డీఎంకే నేతలు కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘గతంలో డీఎంకే గురించి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఓ మాట చెప్పారు. కరుణానిధి ఏదైనా పార్టీని సమర్ధించినా లేదా వ్యతిరేకించినా దానికి సైద్ధాంతిక భావజాలమే ప్రాతిపదికగా ఉంటుందని ఇందిర అన్నారు. డీఎంకే వైఖరిని తెలుసుకోవడానికి ఆనాడు ఇందిరాగాంధీ చెప్పిన మాటలు సరిపోతాయి’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story