ఈడీ డైరెక్టర్‌గా మిశ్రా పదవీ కాలం పొడిగింపు రద్దు..

by Vinod kumar |
ఈడీ డైరెక్టర్‌గా మిశ్రా పదవీ కాలం పొడిగింపు రద్దు..
X

న్యూఢిల్లీ: డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపును సుప్రీం కోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ పొడిగింపు 2021లో సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని జస్టిస్ బీఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, సంజయ్ కరోల్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొన్నది. మిశ్రాకు నవంబరు 2021 తర్వాత పొడిగింపు ఇవ్వకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆ తీర్పులో ఆదేశించింది. మరోవైపు ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తూ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చట్టానికి పార్లమెంటు చేసిన సవరణలను కోర్టు సమర్ధించింది.

సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మిశ్రా పదవీకాలాన్ని పొడిగించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నది. ఆయినా.. ఆయన వచ్చే ఏడాది జులై 31వ తేదీ వరకు పదవిలో కొనసాగడానికి అనుమతి ఉందని కోర్టు తెలిపింది. ఈడీ డైరెక్టర్‌గా మిశ్రా తొలిసారి నవంబరు 2018లో నియమితులయ్యారు. ఆ పదవీ కాలం నవంబర్ 2020లో ముగిసింది. అయితే.. డైరెక్టర్ పదవీ కాలాన్ని రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచుతూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారని కేంద్ర ప్రభుత్వ కార్యాలయం 2020 నవంబర్ 13వ తేదీన తెలిపింది. దీన్ని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. 2021లో సీవీసీ చట్టాన్ని సవరిస్తూ ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

Advertisement

Next Story