Supreme Court : మూడు వారాల్లోగా టాస్క్ ఫోర్స్ మధ్యంతర నివేదిక తయారు చేయాలి

by Shamantha N |
Supreme Court : మూడు వారాల్లోగా  టాస్క్ ఫోర్స్ మధ్యంతర నివేదిక తయారు చేయాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అయితే, మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది. దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును కోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. టాస్క్‌ఫోర్స్ తన తుది నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత చట్టాలు వైద్యుల సంస్థాగత భద్రతా సమస్యలను తగినంతగా పరిష్కరించడం లేదని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారం జరగనుంది.

టాస్క్ ఫోర్సు సభ్యులు వీరే..

ఇకపోతే, సుప్రీంకోర్టు పదిమందితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. స‌ర్జ‌ర్ వైస్ అడ్మిర‌ల్ ఆర్ స‌రిన్‌, డాక్ట‌ర్ డి నాగేశ్వ‌ర్ రెడ్డి, డాక్ట‌ర్ ఎం శ్రీనివాస్ , డాక్ట‌ర్ ప్ర‌తిమా మూర్తి, డాక్ట‌ర్ గోవ‌ర్ద‌న్ ద‌త్ పురి, డాక్ట‌ర్ సౌమిత్ర రావ‌త్‌, ప్రొఫెస‌ర్ అనితా స‌క్సేనా(ఎయిమ్స్ కార్డియాల‌జిస్ట్‌), ప్రొఫెస‌ర్ ప‌ల్ల‌వి స‌ప్రే(ముంబై గ్రాంట్ కాలేజీ డీన్‌), డాక్ట‌ర్ ప‌ద్మ శ్రీవాత్స‌వ్‌(ఎయిమ్స్ న్యూరాల‌జీ) ఉన్నారు. వీరితో పాటు కేంద్ర ప్ర‌భుత్వ క్యాబినెట్ సెక్ర‌ట‌రీ, కేంద్ర ప్ర‌భుత్వం హోం కార్య‌ద‌ర్శి, కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి, జాతీయ మెడిక‌ల్ క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్‌, నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామిన‌ర్స్ ప్రెసిడెంట్ టాస్క్ ఫోర్సులో సభ్యులుగా ఉన్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవే..

జాతీయ టాస్క్ ఫోర్స్ స‌భ్యులు ఓ యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్యుల భద్రత కోసం పలు చర్యలు తీసుకోవడం అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎమ‌ర్జెన్సీ రూంల వ‌ద్ద అద‌న‌పు భ‌ద్ర‌త‌ను పెంచ‌డం, ఆస్ప‌త్రుల వ‌ద్ద బ్యాగేజీ స్క్రీనింగ్ పెంచ‌డం, పేషెంట్లు కాని వారు ఓ ప‌రిధి దాటి లోప‌లికి రాకుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించింది. లింగ ఆధారిత నేరాల‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు వేయాలని పేర్కొంది. ఇంటెర్నీలు, రెసిడెంట్‌, నాన్ రెసిడెంట్ డాక్ట‌ర్ల భ‌ద్ర‌త కోసం జాతీయ ప్ర‌ణాళిక‌ల‌ను టాస్క్ ఫోర్స్ స‌భ్యులు రూపొందించాల్సి ఉంటుందని తెలిపింది. ఆస్ప‌త్రుల్లో జ‌నాన్ని అదుపు చేసేందుకు భ‌ద్ర‌త కావాలని.. మహిళా, పురుష వైద్యులకు వేర్వేరుగా రెస్టు రూమ్‌లు కేటాయించాలని సూచించింది. అన్ని ప్రాంతాల్లో స‌రైన లైటింగ్, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కోరింది. మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్‌ను త‌ర‌లిచేందుకు రాత్రి ప‌ది నుంచి ఆరు వ‌ర‌కు ట్రాన్స్‌పోర్టు సౌకర్యం ఉండేలా చూడాలంది. ఎమ‌ర్జెన్సీ వేళ మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ కోసం హెల్ప్‌లైన్ నెంబ‌ర్ ఏర్పాటు చేయాలని మార్గ‌ద‌ర్శ‌కాల్లో సూచించారు. సంస్థాగత భద్రతా చర్యల కోసం త్రైమాసిక ఆడిట్ లు నిర్వహించాలంది. హాస్పిటల్ కు వచ్చే రోగులకు అనుగుణంగా పోలీసు బలగాలను ఏర్పాటు చేయాలంది. పోష్ చట్టం కేవలం వైద్య సంస్థలకు వర్తిస్తుందని.. డాక్టర్ల కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)ని ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం

మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్‌కు సంస్థాగ‌త భ‌ద్ర‌త అవ‌స‌ర‌మని విచార‌ణ సంద‌ర్భంగా సీజేఐ తెలిపారు. 36 గంట‌ల పాటు విధుల్లో ఉండే డాక్ట‌ర్లు, రెసిడెంట్‌, నాన్ రెసిడెంట్ డాక్ట‌ర్ల‌కు రెస్టు రూమ్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. దేశ ప్ర‌యోజ‌నాలు, స‌మాన‌త్వ కోసం మ‌హిళా డాక్ట‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని సీజేఐ స్ప‌ష్టం చేశారు. మ‌రో రేప్ జ‌రిగే వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోకుండా ఉండ‌లేమ‌ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైద్యుల‌ను ర‌క్షించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ట్టాలు ఉన్నా, అవి వ్య‌వ‌స్థీకృత నేరాల‌ను అడ్డుకోవ‌డం లేద‌ని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అణిచివేసేందుకు బెంగాల్ ప్రభుత్వం బలప్రయోగం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్జీకర్ ఆస్పత్రిలో ఆర్ధరాత్రి జరిగిన విధ్వంసాన్ని ఆపడంలో విఫలమైనందుకు బెంగాల్ ప్రభుత్వంపై సీజేఐ ధర్మాసనం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed