‘ఢిల్లీని వీడొద్దు, మీడియాతో మాట్లాడొద్దు’

by GSrikanth |
‘ఢిల్లీని వీడొద్దు, మీడియాతో మాట్లాడొద్దు’
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సత్యేందర్ జైన్‌కు 6 వారాల పాటు షరతులతో కూడిన బెయిల్‌‌ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఢిల్లీని వదిలి వెళ్లరాదని, మీడియా ముందు ఎలాంటి కామెంట్స్ చేయొద్దని స్పష్టం చేసింది. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వైద్య సమస్యలతో బాధపడుతున్న జైన్..ఆయనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది.

అంతేకాకుండా, మెడికల్ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఈ ఉత్తర్వులు 2023 జూలై 11 వరకు అమలులో ఉంటాయి. జులై 10న కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. కాగా, మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సత్యేందర్ జైన్ గురువారం నాడు బాత్‌రూమ్‌లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, మనీలాండరింగ్ కేసులో జైన్‌ను గతేడాది మేలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినప్పటి నుంచి ఆయనను తీహార్ జైలులో ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed