Supreme court: ప్రతి మహిళకూ గృహ హింస చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు

by vinod kumar |   ( Updated:2024-09-26 10:10:26.0  )
Supreme court: ప్రతి మహిళకూ గృహ హింస చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: మతంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి మహిళకూ గృహ హింస చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2005 నాటి ఈ చట్టం రాజ్యాంగం ద్వారా కల్పించిన మహిళల హక్కులను రక్షించేందుకు మతపరమైన, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా వర్తించే సివిల్ కోడ్ అని పేర్కొంది.భరణం, నష్టపరిహారం మంజూరుకు సంబంధించిన విషయంలో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన అప్పీల్‌పై న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. మహిళ ఇంతకుముందు చట్టంలోని సెక్షన్ 12 కింద పిటిషన్ దాఖలు చేయగా..ఆమెకు నెలవారీ భరణంగా రూ. 12,000 మరియు నష్టపరిహారంగా రూ. లక్ష మంజూరు చేస్తూ న్యాయస్థానం అనుమతించింది.

అయితే ఈ ఉత్తర్వులపై తన భర్త అప్పీల్ దాఖలు చేశాడని, ఆలస్యం కారణంగా అప్పీల్ కోర్టు కొట్టివేసిన విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మహిళల హక్కులను మరింత సమర్థవంతంగా పరిరక్షించేలా గృహ హింస చట్టం రూపొందించబడిందని తెలిపారు. చట్టంలోని సెక్షన్ 25ను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇది ఆదాయంలో పెరుగుదల, తగ్గుదల ఇతర సంబంధిత కారకాలు వంటి ఆర్థిక పరిస్థితులలో మాత్రమే మార్పును కలిగి ఉంటుందని తెలిపింది. చట్టంలో రూపొందించిన రూల్స్ ప్రకారం.. బాధిత వ్యక్తి చట్టంలోని నిబంధనల ప్రకారం చేసిన ఆర్డర్‌ను మార్చడం, సవరించడానికి ప్రయత్నించొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు మహిళ పిటిషన్‌ను కొట్టే వేసింది.

Advertisement

Next Story

Most Viewed