Supreme Court: న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పొద్దు

by Shamantha N |
Supreme Court: న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పొద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. గతేడాది ఈ కేసులో యుక్తవయసులోని బాలికను ‘లైంగిక ప్రేరేపణలను నియంత్రించుకోవాలి’’ అని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను కలకత్తా హైకోర్టు చేసింది. కాగా.. నిందితుడ్ని నిర్దోషిగా విడుదల చేస్తూ.. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దీనిపై గతంలోనే విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు సూచనలపై అసహనం వ్యక్తంచేసింది. న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పరాదని పేర్కొంది. అందులో భాగంగానే మంగళవారం తీర్పు వెలువరించింది. నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. అతడి శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాక.. కోర్టులు తీర్పులు ఎలా రాయాలన్న దానిపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల నిర్వహణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

అసలు కేసు ఏంటంటే..?

గతేడాది పోక్సో కేసుని హైకోర్టు న్యాయమూర్తులు చిత్త రంజన్ దాస్, పార్థసారధి సేన్‌లతో కూడిన డివిజన్ బెంజ్ విచారణ జరిపింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆ వ్యక్తి కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. గతేడాది అక్టోబరులో దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. సంచలన తీర్పు వెలువరించింది. విచారణలో అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నట్లు తేలిందని పేర్కొంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే కారణంగా బాలికపై అత్యాచారం చేసినప్పటికీ యువకుడిని కలకత్తా హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ సందర్భంగా న్యాయస్థానం కొన్ని సూచనలు చేసింది. ‘‘కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే.. సమాజం దృష్టిలో బాలికలు విలువలు మిగిలిపోతారు. కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి’’ అని సూచించింది. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సూచనలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేసింది. కాగా.. దానిపై సోమవారం ఉన్నతన్యాయస్థానం తీర్పుని వెలువరించింది.

Advertisement

Next Story

Most Viewed