Britain : బ్రిటన్‌లో ప్రవాస ఉద్యోగులకు ఆకస్మిక సెలవు.. కారణం ఇదే

by Hajipasha |
Britain : బ్రిటన్‌లో ప్రవాస ఉద్యోగులకు ఆకస్మిక సెలవు.. కారణం ఇదే
X

దిశ, నేషనల్ బ్యూరో : బ్రిటన్‌లో అల్లర్లు ఆగిపోయినప్పటికీ పలు నగరాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌతాంప్టన్‌ సహా పలు నగరాల్లో కర్ఫ్యూను తలపించే వాతావరణం నెలకొంది. భారత్ సహా పలుదేశాల వలసదారులు పెద్దసంఖ్యలో నివసించే సిటీలు పోలీసు పహారాలో ఉన్నాయి. గతనెల 29న లండన్ నగరంలో ముగ్గురు బాలికల మర్డర్ జరిగింది. ఆ హత్యకు పాల్పడిన వ్యక్తి ఓ మతానికి చెందిన వలసదారుడు అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో ఇటీవలే బ్రిటన్‌లో అల్లర్లు జరిగాయి. వలసదారులకు మద్దతు పలికే వర్గాలు, వలసదారులను వ్యతిరేకించే వర్గాలు రోడ్లపై బాహాబాహీకి దిగాయి. ఈనేపథ్యంలో తాజాగా సౌతాంప్టన్‌ సహా దాదాపు 50 యూకే నగరాల్లోని వలసదారులకు వారు పనిచేసే కంపెనీల నుంచి అలర్ట్ మెసేజ్‌లు వచ్చాయి. భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతానికి ఈ బుధవారం రోజు విధులకు రావొద్దని కంపెనీలు వారికి సూచించాయి. వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాడీక్యామ్స్ ధరించాలని కోరాయి.మరోవైపు గత రాత్రి కూడా బ్రిటన్‌‌లోని పలుచోట్ల ఆందోళకారులపై ఫార్ రైట్ గ్రూపులకు చెందిన వారు దాడులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం మాత్రం ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తోంది. ఎంతోమంది అల్లరిమూకలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అల్లర్లను అదుపుచేసి శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు 6వేల మంది స్పెషలిస్టు పోలీసులను కూడా రంగంలోకి దింపారు.

నేర చరితులను జైల్లో పెట్టాం : బ్రిటన్ ప్రధాని

బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ తాజాగా బుధవారం కూడా కీలక ప్రకటన చేశారు. ఈ అల్లర్లలో సూత్రధారులుగా వ్యవహరించిన కొందరు నేరచరితులను గుర్తించి జైల్లో పెట్టామని ఆయన వెల్లడించారు. 400 మందికిపైగా అల్లరిమూకలను అరెస్టు చేయడంతో పాటు 120 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మరెంతో మందిని రోజూ అదుపులోకి తీసుకొని కోర్టుల ఎదుట హాజరుపరుస్తున్నామని కైర్ స్టార్మర్ తెలిపారు. యూకే వీధుల్లో అల్లరి మూకలకు చోటు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ‘‘బ్రిటన్ వ్యాప్తంగా ఫార్ రైట్ గ్రూపులు 100 నిరసనలు తెలిపేందుకు రెడీ అవుతున్నాయి. వారిని వ్యతిరేకిస్తూ 30 చోట్ల పౌర హక్కుల సంఘాల నిరసనలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో ఎంపీలు కావాలంటే వర్క్ ఫ్రం హోం చేయొచ్చు’’ అని కామన్స్ సభ స్పీకర్ లిండ్సే హోయ్లే ప్రకటించారు.

పార్లమెంటును రీకాల్ చేయండి.. సర్వేలో ప్రజాభిప్రాయం

అల్లర్ల నేపథ్యంలో బ్రిటన్ ప్రజల మనోగతం ఎలా ఉందనే దానిపై ‘యూ గవ్’ (YouGov) సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 64 శాతం మంది బ్రిటన్ పార్లమెంటును రీకాల్ చేయాలని, అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. మరో 16 శాతం రీకాల్ అవసరం లేదన్నారు.

Advertisement

Next Story