నా పార్టీని అన్యాయంగా లాక్కున్నారు.. ఈసీది తప్పుడు నిర్ణయమే : శరద్ పవార్

by Hajipasha |
నా పార్టీని అన్యాయంగా లాక్కున్నారు.. ఈసీది తప్పుడు నిర్ణయమే : శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో : తాను స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరు, గుర్తులను అజిత్ పవార్ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడాన్ని శరద్ పవార్ తప్పుపట్టారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నికల సంఘం ఇలాంటి అన్యాయమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. వ్యవస్థాపక నేత నుంచి రాజకీయ పార్టీని లాక్కొని ఇతరులకు అప్పగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని శరద్ పవార్ పేర్కొన్నారు. ‘‘రాజకీయ పార్టీకి గుర్తు అనేది తాత్కాలికంగానే పనికొస్తుంది. గుర్తు ఎఫెక్టు ప్రజలపై ఎక్కువ కాలం ఉండదు. పార్టీ కార్యక్రమాలు, విధానాలు, భావజాలాన్నే ప్రజలు ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు’’ అని ఆయన చెప్పారు. ‘‘మా పార్టీ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలెవరూ సమర్ధించరని నాకు తెలుసు. అందుకే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను’’ అని తెలిపారు. కాగా, మెజారిటీ ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌ వెంటే ఉన్నారు. దీంతో ఎన్సీపీ పేరు, గడియారం గుర్తులను అజిత్ పవార్‌‌ వర్గానికే ఈసీ కేటాయించింది. ఇక శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసుకునే కొత్త పార్టీకి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- శరద్ చంద్ర పవార్’ అనే పేరును ఈసీ కేటాయించింది. ఇంకా గుర్తును కేటాయించాల్సి ఉంది.

Advertisement

Next Story