Stuble burning: పంట వ్యర్థాల దహనం.. రైతుల జరిమానా భారీగా పెంపు

by vinod kumar |
Stuble burning: పంట వ్యర్థాల దహనం.. రైతుల జరిమానా భారీగా పెంపు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం(Air Pollution) సమస్య తీవ్రంగా మారుతోంది. రోజు రోజుకూ గాలి నాణ్యత పడిపోతుండటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు (Supreme court) సైతం ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఢిల్లీ ఎన్సీఆర్ (Delhi Ncr) ప్రాంతంలో పంట వ్యర్థాలను తగులబెట్టే రైతులకు విధించే జరిమానాను రెట్టంపు చేసింది. తాజా ఆదేశాల ప్రకారం.. 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ. 5 వేలు, రెండు నుంచి ఐదెకరాల మధ్య ఉన్న వారికి 10 వేలు, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రూ.30,000జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.

కాగా, పంజాబ్, హర్యానాలోని రైతులు పంట వ్యర్థాలను దహనం చేయడంతో ప్రతి ఏటా ఢిల్లీలో శీతాకాలంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీంతో రైతులు తమ పొలాల్లోని పొట్టును తగులబెట్టకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)పైనా సీరియస్ అయింది. పంట వ్యర్థాలు తగులబెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాలుష్య రహిత వాతావరణంలో జీవించడం పౌరుల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జరిమానా పెంచింది.

Advertisement

Next Story