ఎన్నికల వేళ స్టాలిన్ సంచలన నిర్ణయం.. కమలం దూకుడు ఆపడం కోసమేనా?

by Hamsa |   ( Updated:2023-03-31 07:21:56.0  )
ఎన్నికల వేళ స్టాలిన్ సంచలన నిర్ణయం.. కమలం దూకుడు ఆపడం కోసమేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో కమలం పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విపక్షాల వ్యూహం పన్నుతున్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని నిర్ణయించాయి. తమ మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి మోడీని ఢీ కొట్టడమే టార్గెట్ గా పని చేయాలని భావిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో విపక్ష నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వీరి ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ముంగిట్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలతో ఓ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. చెన్నై వేదికగా ఏప్రిల్ 3న దేశంలోని సామాజిక న్యాయం పై విపక్షాల చర్చ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ తెలిపారు. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ తో పాటు సుమారు 20 పార్టీలు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఆర్జేడీ తరపున తేజస్వీ యాదవ్, సీపీఐ, సీపీఐల నుంచి సీతారాం ఏచూరి, డి రాజా, ఆమ్ ఆద్మీ తరపున సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిగా డెరెక్ ఒబ్రెయిన్ తో పాటు మరికొంత మంది నేతలు హాజరవుతారని స్టాలిన్ వివరించారు. స్వయంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ ఈ మీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

బీజేపీ సౌత్ స్ట్రాటజీ చెక్ పెట్టడమే వ్యూహమా:

గత కొంత కాలంగా బీజేపీ పెద్దలు సౌత్ ఇండియాపై దృష్టి సారించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల తేదీ వచ్చేసింది. దీంతో ఇక్కడ మోడీకి చెక్ పెట్టాలనేది విపక్షాల వ్యూహంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగే అవకాశాలు లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన స్టాలిన్ బర్త్ డే వేడుకల సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ ప్రధాని రేస్ లో స్టాలిన్ ఎందుకు ఉండకూడదు అంటూ స్టాలిన్ వైపు దృష్టి అందరి మళ్లించారు. దీంతో సౌత్ ఇండియాకు చెందిన వ్యక్తికే ప్రధాని పదవి అనే అంశం విపక్షాల కూటమిలో జోరుగా జరుగుతోంది. ఓ వైపు కేసీఆర్ నేషనల్ పాలిటిక్ పేరుతో రాజకీయాలు చేస్తున్న వేళ కర్ణాటక ఎన్నికల సమయంలో ఈ విపక్షాల సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తిని రేపుతోంది.

Advertisement

Next Story