Spider-man Arrest: ఢిల్లీలో స్పైడర్‌మ్యాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

by Harish |
Spider-man Arrest: ఢిల్లీలో స్పైడర్‌మ్యాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశరాజధాని ఢిల్లీలో స్పైడర్‌మ్యాన్ వేషధారణతో ప్రమాదకర విన్యాసాలు చేసే వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. స్పైడర్‌మ్యాన్ దుస్తులు ధరించిన వ్యక్తి స్కార్పియో బోనెట్‌ కారుపై ప్రమాదకర రీతిలో కూర్చుని ప్రయాణించగా, దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో కొంతమంది సోషల్ మీడియాలో దీనిపై ఫిర్యాదు చేయడంతో వెంటనే ద్వారకలో ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి వాహనం నెంబర్ ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. స్కార్పియో బోనెట్‌ కారులో స్పైడర్‌మ్యాన్ దుస్తులు ధరించిన వ్యక్తిని 20 ఏళ్ల ఆదిత్య, వాహన డ్రైవర్ గౌరవ్ సింగ్ (19)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్ ధరించకపోవడం వంటి అభియోగాల క్రింద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై గరిష్టంగా రూ. 26,000 జరిమానా/లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని పోలీసులు తెలిపారు. వీరు ఇద్దరూ నజఫ్‌గఢ్‌కు చెందిన వారు.

గతంలో కూడా ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER II)లో ఆదిత్య, అతని స్నేహితురాలు అంజలి (19) స్పైడర్‌మ్యాన్ దుస్తులు ధరించి, హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ దానిని ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయింది. వెంటనే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు విచారణ ప్రారంభించి హెల్మెట్, అద్దం, లైసెన్స్ లేకపోవడం, అలాగే ప్రమాదకరమైన డ్రైవింగ్, నంబర్ ప్లేట్ ప్రదర్శించకపోవడం వంటి మోటారు వాహన చట్టం నిబంధనలు అతిక్రమించినందుకు ఇద్దరిని అరెస్టు చేసి చలాన్ జారీ చేశారు.



Next Story