పదేళ్లలో పాన్, పొగాకు, మత్తు పదార్థాలపై ఎక్కువ ఖర్చు చేసిన ప్రజలు

by S Gopi |
పదేళ్లలో పాన్, పొగాకు, మత్తు పదార్థాలపై ఎక్కువ ఖర్చు చేసిన ప్రజలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని ప్రభుత్వ సర్వే వెల్లడించింది. గత పదేళ్లలో ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువగా ఇలాంటి వాటిపై అధికంగా ఖర్చు చేస్తున్నారని సర్వే తెలిపింది. గృహ వినియోగ వ్యయ సర్వే-2022-23 నివేదిక ప్రకారం, మొత్తం ఇంటి ఖర్చులో పాన్, పొగాకు, మత్తు పదార్థాలపై చేసే ఖర్చు ఇటు పట్టణాలతో పాటు గ్రామీణంలోనూ పెరిగింది. 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో వీటిపై 3.21 శాతం ఖర్చు చేయగా, 2022-23లో ఇది 3.79 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 1.61 శాతం నుంచి 2.43 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో విద్య కోసం చేసే ఖర్చు 6.90 శాతం నుంచి 5.78 శాతానికి తగ్గడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో విద్య కోసం 3.49 శాతం నుంచి 3.30 శాతానికి పడిపోయింది. డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఆహారంపై పట్టణాల్లో 8.98 శాతం నుంచి 10.64 శాతానికి పెరిగింది. గ్రామీణంలో 7.90 శాతం నుంచి 9.62 శాతానికి చేరింది. రవాణా ఖర్చు పట్టణాల్లో 6.52 శాతం నుంచి 8.59 శాతం పెరగ్గా, గ్రామీణంలో 4.20 శాతం నుంచి 7.55 శాతానికి పెరిగింది.

అధ్యయనం ప్రకారం, నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-12 నుంచి 2022-23 మధ్య రెండింతలు పెరిగింది. పట్టణాల్లో రూ. 2,630 నుంచి ప్రస్తుత ధరల ప్రకారం సగటున రూ. 6,459కి చేరింది. గ్రామీణంలో రూ. 1,430 నుంచి రూ. 3,773కి ఎగబాకింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ), స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 2022, ఆగస్టు నుంచి 2023, జూలై మధ్య ఈ సర్వేను నిర్వహించింది. గృహ వినియోగ వ్యయంపై ఈ సర్వే ప్రతి కుటుంబం నుంచి నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) అంచనాలను సేకరించింది.

Advertisement

Next Story