ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు

by Hamsa |   ( Updated:2023-11-09 08:18:05.0  )
ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు
X

న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించేలా పర్యవేక్షించడానికి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గురువారం హైకోర్టులను ఆదేశించింది. అలాగే, క్రిమినల్ కేసుల సత్వర విచారణ నిమిత్తం సుమోటోగా కేసు నమోదు చేయాలని పేర్కొంది. చట్టసభలోని సభ్యులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను తొందరగా పరిష్కరించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ క్రమంలోనే రాజకీయ నేతలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయడానికి ఖచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించడం క్లిష్టమైన ప్రక్రియగా భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వివిధ హైకోర్టులు అందజేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌ కేసుల వివరాల ప్రకారం, 2022, నవంబర్ నాటికి ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,175 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1,377 ఉన్నాయి. ఆ తర్వాత బీహార్‌లో 546, మహారాష్ట్ర(169), ఒడిశా(323), తమిళనాడు(60), కర్ణాటక(61), మధ్యప్రదేశ్(51), జార్ఖండ్(72) పెండింగ్ కేసులు ఉన్నాయి.

ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు పలు కీలక సూచనలు చేసింది.

* ట్రయల్ కోర్టులు అత్యవసరం అనుకుంటే తప్ప రాజకీయ నేతలపై కేసుల విచారణను వాయిదా వేయకూడదు.

* క్రిమినల్ కేసుల్లో రాజకీయ నేతల విచారణ స్థితిగతులపై నివేదికల కోసం హైకోర్టులు ప్రత్యేక దిగువ కోర్టులను పిలవవచ్చు.

* కేసుల వివరాలు, విచారణలో ఉన్న అంశాలకు సంబంధించిన వివరాలను జిల్లా, ప్రత్యేక కోర్టుల నుంచి సేకరించి హైకోర్టు వెబ్‌సైట్‌లో విడిగా పొందుపరచాలి.

* అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీలను జిల్లా కోర్టులే ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

* దోషులుగా తేలిన తర్వాత రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించడంపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story