'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో పాల్గొంటానని అఖిలేష్ ప్రకటన

by S Gopi |
భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారైంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటానని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం ప్రకటించారు. ఆగ్రాలో జరిగే ర్యాలీకి హాజరవ్వాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. 'కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో తాము వివిధ దశల్లో చర్చలు నిర్వహించామని, పలు రకాల జాబితాలను పరిశీలించాం. సీట్ల సర్దుబాటు పూర్తయిన అనంతరం కాంగ్రెస్ యాత్రలో పాల్గొంటానని' అఖిలేష్ స్పష్టం చేశారు. ఇటీవల ఇద్దరు సీనియర్ రాజకీయ ప్రముఖులు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కొనసాగేందుకు విముఖత ప్రకటించడంతో ప్రతిపక్షాల కూటమి ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్ పార్టీ పొత్తు ఖరారవడం గమనార్హం. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండవ నెలలోకి ప్రవేశించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను కలుపుకుని పోయే ప్రయత్నాలతో రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతోంది. రాహుల్ యాత్ర కొనసాగుతున్న సమయంలోనే బెంగాల్ సీఎం మమతా లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. రాహుల్ యాత్ర బెంగాల్‌లో ప్రవేశించినపుడు తనకు మర్యాదపూర్వక ఆహ్వానం అందలేదని, కూటమిలో ఉన్నప్పటికీ గౌరవం దక్కలేదని ఆరోపించారు. ఇక, బీహార్ సీఎం నితీష్ సైతం కూటమి నుంచి బయటకు వెళ్లి ఎన్‌డీయేలో చేరడం చర్చనీయాంసం అయింది.

Advertisement

Next Story