తల్లికి పెళ్లి చేసిన కొడుకులు.. ఎక్కడంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-20 06:43:31.0  )
తల్లికి పెళ్లి చేసిన కొడుకులు.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కొడుకులు తీసుకున్న నిర్ణయంతో తల్లి షాక్‌కు గురైంది. ‘పెళ్లీడు కొచ్చిన నా కొడుకులు నా వద్దకు వచ్చి అమ్మా మళ్లీ పెళ్లి చేసుకో అని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా’.. అని ఆ తల్లి తెలిపింది. ఈ అనూహ్య ఘటన తమిళనాడులోని కల్లకురిచి జిల్లా వలయంపట్టు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సెల్వికి ఇద్దరు కొడుకులు భాస్కర్, వివేక్ ఉన్నారు. వీరు చిన్నతనంలోనే తమ తండ్రిని కోల్పోయారు. 2009లో తమ తండ్రిని కోల్పోయినప్పుడు పెద్ద కొడుకు ఇంజనీరింగ్, చిన్న కొడుకు 11 వ తరగతి చదువుతున్నారు.

అయితే భాస్కర్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతుండగా ఒక రోజు టీచర్ అమ్మ ఎంతో కాలంగా ఒంటరిగా జీవితాన్ని గుడుపుతున్నారు. ఎందుకు ఆమెకు మీరు రెండో పెళ్లి చేయకూడదని సదరు టీచర్ సూచించినట్లు తెలిపాడు. ఈ విషయం గురించి తల్లి వద్ద ప్రస్తావన తెచ్చేందుకు చాలా రోజులు భాస్కర్ ఆలోచించారు. ఒక సమయంలో ఈ అంశాన్ని పక్కన బెట్టేశాడు. అయితే పుస్తకాలు చదివే అలవాటున్న భాస్కర్ పునర్ వివాహాలపై పెరియార్ పుస్తకాల్లో రాసిన అంశాలను ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసేవాడు. మన ఇంట్లో తల్లి కూడా భర్తను కోల్పోయి ఒంటరిగా గడుపుతోంది.

ఎందుకు ఆమెకు పెళ్లి చేయకూడదు అనే విషయంపై ఆలోచించాడు. అన్న భాస్కర్ నిర్ణయంతో వివేక్ ఏకీభవించాడు. దీంతో వీళ్లిద్దరు తమ మనసులోని మాటను తల్లికి నేరుగా చెప్పేందుకు ఆలోచించారు. పెద్ద కొడుకు పెళ్లి ప్రస్తావన తెచ్చిన సందర్భంలో తన తల్లితో నువ్వు పెళ్లి చేసుకుంటే తాను చేసుకుంటానని భాస్కర్ తెలిపాడు. ‘‘ఎన్నో ఏళ్లుగా ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నావు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. తొలుతు నువ్వు పెళ్లి చేసుకోవాలి.

ఆ తర్వాత నేను చేసుకుంటాను’’ అని భాస్కర్ స్పష్టం చేశారు. కొన్నేళ్ల పాటు ఇద్దరు కొడుకులు ఇదే విషయమై తరచూ అడుగుతుండటంతో చివరికి సెల్వి రెండో వివాహానికి ఒప్పుకున్నారు. బంధువులు మాత్రం వీరు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తన జీవితాన్ని నిర్ణయించుకునే ధైర్యాన్ని, తెగువను తన కొడుకులు తనకు అందించారని సెల్వి అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ఎవరూ కూడా తన రెండో పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నించారు.

ఎంతో ఆలోచించిన తర్వాత తన కొడుకులు తనకు సపోర్ట్‌గా నిలుస్తారనే ఆశతో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సెల్వి తెలిపారు. పెళ్లి అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదని.. ఒక స్నేహితుడిలా మీ వెంట నిలివేవారని తెలిపారు. వారిచ్చే సపోర్ట్ మీకు మరింత ధైర్యాన్ని అందించాలన్నారు. భర్తలను కోల్పోయి, ఒంటరిగా బతుకుతున్న చాలా మంది యువతులతో తాను మాట్లాడుతున్నానని, వారిని కూడా మోటివేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్య కేవలం మహిళలే ఎందుకు ఎదుర్కోవాలని ఆమె ప్రశ్నించారు.

సమాజం ఈ సమస్యను క్రియేట్ చేసిందన్నారు. కాగా సెల్వి రెండో పెళ్లికి ఆమె కుంటుంబానికి చెందిన ఎవరూ హాజరు కాలేదు. వరుడు తరపు వాళ్లు కొంత మంది మాత్రమే హాజరయ్యారు. సెల్వి ప్రస్తుతం యేలుమలై అనే ఒక రైతు కూలీని పెళ్లి చేసుకున్నారు. ఎంత మంది కొడుకులు తల్లికి పెళ్లి అవసరం అని ఆలోచిస్తారు. ఆమెకి కూడా భాగస్వామి అవసరం అనుకుంటారు. నేను నా కొడుకుల గురించి ఆలోచించినప్పుడు చాలా గర్వంగా భావిస్తాను అని సెల్వి ఉద్వేగంగా తెలిపారు.

Advertisement

Next Story