'7-8 సార్లు కొట్టాడు, ఛాతీ, కడుపులో తన్నాడు': ఎఫ్‌ఐఆర్‌లో స్వాతి మాలివాల్

by S Gopi |
7-8 సార్లు కొట్టాడు, ఛాతీ, కడుపులో తన్నాడు: ఎఫ్‌ఐఆర్‌లో స్వాతి మాలివాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ అద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాతి మాలివాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, వాంగ్మూలంలో స్వాతి మాలివాల్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. బిభవ్ కుమార్ తనపై భౌతికంగా దాడి చేశాడని, తన శరీరంపై సున్నిత ప్రదేశాల్లో విపరీతంగా కొట్టాడని ఆమె ఆరోపణలు చేశారు. ఆ సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ పోలీసులు స్వాతి ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాడి గురించి పోలీసులకు వివరించిన ఆమె, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన పీఏ తనను డ్రాయింగ్ రూమ్‌లో వేచి ఉండాలని చెప్పాడు. తాను వేచి ఉన్న సమయంలో బిభవ్ గదిలోకి వచ్చి ఇష్టమొచ్చినట్టు తిట్టాడని, 7-8 సార్లు చెంపపై కోటాడు. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు. ఏం జరుగుతుందో తెలీక షాక్ అయ్యానని, సాయం కోసం అరిచాను, తనను తాను రక్షించుకునేందుకు అతన్ని కాలితో తోసేశానని, పరిగెడుతున్న సమయంలో చొక్కా పట్టుకుని వెనక్కి లాగాడని ఆమె వివరించారు. తన శరీరంలో సున్నితమైన భాగాలపై చాలాసార్లు కొట్టాడు. అతని దెబ్బలకు పొత్తి కడుపులో నొప్పికి నడవలేకపోయానని, ఏదో రకంగా అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశానని ' స్వాతి మాలివాల్ వాంగ్మూలంలో వివరించారు. కాగా, దాడికి సంబంధించి స్వాతి మాలివాల్‌కు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై గాయాలైనట్టు వైద్యులు పేర్కొన్నారు.

Advertisement

Next Story