Gaza : గాజా పరిస్థితులు కలచివేస్తున్నాయ్.. కాల్పుల విరమణకే మా మద్దతు : భారత్

by Hajipasha |
Gaza : గాజా పరిస్థితులు కలచివేస్తున్నాయ్.. కాల్పుల విరమణకే మా మద్దతు : భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్-హమాస్ భీకర యుద్ధం వల్ల గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా గాజాలో కాల్పుల విరమణను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం సౌదీ అరేబియాలోని రియాద్‌లో భారత్ - గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను, ఇతర దేశీయులను బంధించి అపహరించడాన్ని భారత్ వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

గాజాలోని సామాన్య పౌరుల మరణాలు భారత్‌ను కలచివేస్తున్నాయని, ఆ ప్రాణనష్టాన్ని వెంటనే ఆపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కాల్పుల విరమణ డిమాండ్‌ను తాము వినిపిస్తున్నామని జైశంకర్ చెప్పారు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లను నిర్దిష్టంగా రెండు ప్రత్యేక దేశాలుగా గుర్తించడం ద్వారానే ఈ అశాంతికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. పాలస్తీనా ప్రజలకు చేయూత అందించేందుకు భారత్ ఇప్పటికే తనవంతుగా సహాయక సామగ్రిని పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed