ఖర్గే కుమారుడికి షోకాజ్ నోటీసు..

by Vinod kumar |
ఖర్గే కుమారుడికి షోకాజ్ నోటీసు..
X

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘‘మీరు (ప్రధాని మోడీ) గుల్బర్గా వచ్చినప్పుడు బంజారా వర్గాల ప్రజలకు ఏం చెప్పారు. ‘భయపడకండి. బంజారాల కొడుకు ఢిల్లీలో కూర్చున్నాడు’ అన్నారు. కానీ.. ఢిల్లీలో పనికిమాలిన కొడుకు కూర్చుంటే మీరు మీ కుటుంబాన్ని ఎలా నడపగలరు..?’’ అని ప్రియాంక్ ఖర్గే కర్ణాటకలో గత వారం జరిగిన ఎన్నికల సభలో చేసిన ప్రసంగంలో మోడీని విమర్శించారు. దీనిపై బీజేపీ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ ప్రియాంక్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లుగానే పేర్కొన్నది. గురువారం లోగా సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘విద్వేష రాజకీయాల్లో ప్రియాంక్ ఖర్గే తన తండ్రి మల్లికార్జున ఖర్గేను మించి పోతున్నారు’ అని ఆరోపించారు. కర్ణాటకలో మోడీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ నేతలు ఆందోళనకు గురవుతున్నారని, అందుకే ప్రధానిని, ఆయన కుటుంబాన్ని, సమాజాన్ని తిడుతున్నారని ఠాకూర్ ట్వీట్ చేశారు. అయితే.. తన కుమారుడు ప్రధానిని విమర్శించలేదని, ఓ పార్లమెంటు సభ్యుడిని విమర్శించారని మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed