మరాఠాలకు షాక్: కుంబీ సర్టిఫికెట్లపై బాంబే హైకోర్టులో పిల్

by samatah |
మరాఠాలకు షాక్: కుంబీ సర్టిఫికెట్లపై బాంబే హైకోర్టులో పిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో మరాఠీలకు షాక్ తగిలింది. మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై బాంబే హైకోర్టులో ఓ వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాఖ్యం(పిల్) దాఖలు చేశారు. ఓబీసీ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ మంగేష్ ఈ పిల్ వేశారు. మరాఠా కమ్యూనిటీకి కుంబీ కుల ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయడం ద్వారా ఓబీసీ రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌తో సహా అన్ని జీఓలను రద్దు చేయాలని, మధ్యంతర ఉత్తర్వు ద్వారా కుంబీ కులానికి చెందిన మరాఠా కమ్యూనిటీకి సర్టిఫికెట్ల జారీపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. దీనిని స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ, న్యాయమూర్తి ఆరీఫ్‌లతో కూడిన బెంచ్ విచారణకు మరికొన్ని రోజులు ఆగాలని పిటిషనర్‌కు సూచించింది. అయితే ఫిబ్రవరి 6వ తేదీన విచారణకు రానున్నట్టు తెలుస్తోంది.

జరాంగే పోరాటంతో దొగొచ్చిన ప్రభుత్వం

మరాఠా రిజర్వేషన్ కార్యకర్త మనోజ్ జరంగే జల్నాలోని అంతర్వాలి సారథి నుండి ముంబైకి ఈ నెలలో మార్చ్‌ను ప్రారంభించాడు. మరాఠాలందరికీ కుంబీ సర్టిఫికేట్‌లను జారీ చేయాలని డిమాండ్ చేశాడు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో దిగొచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల డిమాండ్లకు అంగీకరించింది. కుంబీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని, విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేగాక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. దీంతో తాజగా..వీటిపై పిల్ దాఖలు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయంపై మరాఠా కమ్యూనిటీలో ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story